రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, వాటిల్లో పనిచేసే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు, సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) కింద నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ముడి పెడుతోంది. సర్కారు బడుల్లో విద్యార్థులు తక్కువ, ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నందున బడులను, ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాలని చెబుతోంది. గత ఏడాది మే 29న జరిగిన ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) సమావేశంలోనే హేతుబద్ధీకరణను తక్షణమే చేపట్టాలని కేంద్రం సూచించింది. మూడేళ్లుగా దాన్ని అమలు చేయకపోవడంతో ఉపాధ్యాయుల వేతనాల కోసం ఇవ్వాల్సిన నిధుల్లో గత రెండేళ్ల నుంచి కోత పెడుతూ వస్తోంది.
వేల పాఠశాలల మూత ఖాయం
విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ) ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 1:30(ఒక ఉపాధ్యాయుడికి 30 మంది విద్యార్థులు) ఉండాలి. రాష్ట్రంలో అది 1:19గా ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35కి బదులు 1:14, ఉన్నత పాఠశాలల్లో 1:40కి బదులు 1:21గా ఉంది. అంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నందున పాఠశాలలను హేతుబద్ధీకరించాలని కేంద్రం చెబుతోంది. దానిప్రకారం తక్కువ మంది విద్యార్థులున్న బడులను మూసివేసి సమీపంలోని మరో పాఠశాలకు పిల్లల్ని తరలించాలి. అది చేయనందున ఉపాధ్యాయ వేతనాల కింద ఇచ్చే నిధుల్లో కోత పెడుతోందని అధికారి ఒకరు తెలిపారు. హేతుబద్ధీకరణ చేస్తే వేల సంఖ్యలోని పాఠశాలలు మూతపడటం ఖాయం.
ఇదీ పరిస్థితి...
- రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు: 26,068
- పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య: 1.08 లక్షలు
- రాష్ట్రంలో ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు: 1,412
- 15 మంది లోపున్న బడులు: ప్రాథమిక పాఠశాలలు 4,960, ప్రాథమికోన్నత పాఠశాలలు 1,651
రాష్ట్రం విడుదల చేసింది రూ.123 కోట్లే
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) 2020-21 సంవత్సరానికి వేతనాలు, పుస్తకాలు తదితరమైన వాటికి రూ.1,426 కోట్లకు అంగీకారం తెలిపింది. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 పద్ధతిలో భరించాలి. కేంద్ర వాటా కింద సుమారు రూ.400 కోట్లు విడుదలయ్యాయి. విద్యా సంవత్సరం చివరికొస్తున్నా రాష్ట్ర వాటా విడుదల చేయకపోతుండటంపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో తన వాటా కింద తొలి విడతలో మరో రూ.123 కోట్లు విడుదల చేయడం గమనార్హం. అంటే మొత్తం రూ.523 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. వాస్తవానికి వేతనాల విభాగం కింద ఈ విద్యా సంవత్సరానికి రూ.350 కోట్లు రావాల్సి ఉండగా కేంద్రం రూ.80 కోట్లే ఇస్తోందని అధికారి ఒకరు తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్/మే నెలల్లో జరిగే పీఏబీ ద్వారా అరకొర నిధులే వస్తాయని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఏళ్ల తరబడి ప్రాజెక్టుల పనులు... కాంట్రాక్టర్లపై వేటు