కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటిలేటర్ల సరఫరాలో జాప్యం జరుగుతున్నందున రాష్ట్ర సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. కరోనా వైరస్(కొవిడ్ 19) బాధితుల్లో కొందరికి ఆపత్కాలంలో ప్రాణవాయు పరికర(వెంటిలేటర్) సహాయంతో చికిత్సను అందించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేకపోతే.. ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
ఈ తరహా ఉపద్రవాన్ని ముందే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తమకు కొత్తగా 1400 వెంటిలేటర్లు సమకూర్చాలని నెల రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా సరఫరాలో జాప్యం జరుగుతోంది. పది దాకా ఇస్తామన్నా అవీ రాలేదు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 600 వెంటిలేటర్లను సొంతంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. రాష్ట్రంలో ఐసీయూ వెంటిలేటర్ల ఉత్పత్తి సంస్థ లేకపోవడం.. దేశం మొత్తమ్మీద కూడా అవి పరిమిత సంఖ్యలోనే ఉండడం కారణాలుగా ఉన్నాయి.
కొన్నిచోట్ల ఉన్నా కూడా.. ఆయా రాష్ట్రాలు ముందుగా తమ స్థానిక అవసరాలకు తగినట్లుగా సమకూర్చుతున్న తర్వాతనే.. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే పరిస్థితులున్నాయి. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే అత్యధికం. ప్రస్తుతం ఆయా దేశాల్లోనూ వినియోగం పెరిగిపోవడం.. దిగుమతులు నిలిచిపోవడంతో అక్కణ్నుంచి రాలేని దుస్థితి. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత రాష్ట్రంలో తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నా.. మున్ముందు ఉన్నట్టుండి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగితే అప్పుడు వెంటిలేటర్ల అవసరం తప్పదని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బహిరంగ విపణిలో 50 కొనుగోలు
కేంద్రం నుంచి వెంటిలేటర్ల సరఫరా జరగకపోయినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. బహిరంగ విపణిలో అందుబాటులో ఉన్న 50 వెంటిలేటర్లను కొత్తగా కొనుగోలు చేసింది. వీటిలో 26 పరికరాలను కొత్తగా కరోనా చికిత్సకు ఏర్పాటుచేసిన కింగ్‌కోఠి ఆసుపత్రిలో సిద్ధం చేసింది. ఛాతీ ఆసుపత్రి, గచ్చిబౌలి ఆసుపత్రుల్లో ఒక్కో దాంట్లో 12 వెంటిలేటర్ల చొప్పున అందుబాటులోకి తెచ్చింది. గాంధీ ఆసుపత్రి సహా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రస్తుతం 300 దాకా ఉన్నాయి.
ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని వాటిని కూడా అవసరాలను బట్టి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మొత్తంగా సుమారు 600 వరకూ అందుబాటులో ఉన్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. మున్ముందు విదేశాల నుంచి వెంటిలేటర్ల దిగుమతులపై ఆంక్షలు సడలించడం ద్వారా కొనుగోలుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నాయి.
దేశీయ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలపైన కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తే అప్పుడు స్థానికంగా కూడా సమకూర్చుకోవచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: 'పిల్లలకు టీకాలు వేయకుంటే దక్షిణాసియా దేశాలు అంతే'