State Loans Nirmala Seetaraman: ఆర్‌బీఐ ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాలే కాకుండా.. కొన్ని రాష్ట్రాలు తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సాధనాల ద్వారా రుణాలు తీసుకుని వాటికి సంబంధించిన అసలు, వడ్డీని బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నట్లు ఆర్థికశాఖ దృష్టికి వచ్చినట్లు నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల భారంపై భాజపా సభ్యుడు కిషన్ కపూర్ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ పలు అంశాలను వెల్లడించారు.
కేంద్రం ఇచ్చిన నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తూ పక్కదారుల్లో రుణాలు తీసుకోవడం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై మార్చిలో రాష్ట్రాలను హెచ్చరించినట్లు చెప్పారు. ఇలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సాధనాల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నుంచి కానీ, లేదంటే రాష్ట్ర పన్నులు, సెస్సులు, ఇతర ఆదాయాలను అసైన్‌మెంట్ చేసి కానీ చెల్లిస్తే వాటిని ఆర్టికల్ 293(3) కింద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకిందే పరిగణిస్తామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
ఏపీది 8, తెలంగాణది 11వ స్థానం
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అనుసరించి కేంద్రం అనుమతించిన నికర రుణ పరిమితి మేరకు బహిరంగ మార్కెట్ నుంచి చేసిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి. దేశంలోని 28 రాష్ట్రాలు కలిపి 2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.68 లక్షల కోట్లు అప్పు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.3,98,903 కోట్లు, తెలంగాణ వాటా రూ.3,12,191 కోట్లుగా ఉంది. 2020 నుంచి 2022 మధ్య ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.91,232 కోట్లు పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ చేసిన రుణం రూ.86,773 కోట్లు.
అప్పుల ఊబిలోకి రాష్ట్రం: ఎంపీ ఉత్తమ్
ఇష్టారీతిగా అప్పులు చేస్తూ తెలంగాణను రుణాల ఊబిలోకి నెడుతున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు తీసుకోవడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో వెల్లడించారని ఆయన చెప్పారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో దానిని రూ.3.12 లక్షల కోట్లకు తెరాస ప్రభుత్వం పెంచిందని ఆయన మండిపడ్డారు.
ఆ కేసులు తేలాకే.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా దృష్ట్యా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 నుంచి 62 శాతానికి పెంచేందుకు 2017లో చేసిన బిల్లుపై తదుపరి ప్రక్రియను సుప్రీంకోర్టులో ఉన్న సివిల్ అప్పీల్ నంబర్ 2628, 2637/2010 కేసులు తేలాకే చేపడతామని తాజాగా కేంద్ర హోంశాఖ పార్లమెంటు హామీల అమలు కమిటీకి చెప్పింది. న్యాయశాఖ, ఇతర శాఖలతో సంప్రదించి ఈ బిల్లును పరిశీలిస్తున్నట్లు 2018 ఆగస్టు 6న అప్పటి తెరాస ఎంపీ సీతారాంనాయక్ అడిగిన ప్రశ్నకు అప్పటి గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి బదులిచ్చారు. దీనిపై మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఇప్పటివరకూ తీసుకోకపోవడంతో అది హామీల అమలు కమిటీ ముందుకు వచ్చింది. అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించే అంశంపై దాఖలైన రెండు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే ఈ బిల్లుపై తదుపరి కార్యాచరణకు అవకాశం ఉన్నందున సభా ముఖ హామీని పక్కనపెట్టాలని హోంశాఖ.. కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఇందులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత కమిటీ అందుకు ఆమోదముద్ర వేసింది.
ఇదీ చదవండి: High Court Judges: హైకోర్టు జడ్జిలుగా ఆరుగురు.. సుప్రీం కొలీజియం సిఫారసు