Central Election Commission Telangana Tour 2023 : జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రలోభాల విషయమై అధికారులను కాస్త గట్టిగానే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దేశంలోనే ఎక్కువగా ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్న ఈసీ బృందం..ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకునే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో అందుకు అనుగుణంగా డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, కానుకలు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం.
EC on Telangana Elections 2023 : గత ఎన్నికలు మునుగోడు ఉపఎన్నికను ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు అధికారవర్గాల చెబుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో స్వాధీనం చేసుకునేది చాలా తక్కువగా ఉంటుందన్నట్లు తెలిపింది. కర్ణాటక, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారని వివరించినట్లు సమాచారం. గత ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, మద్యాన్ని ఏం చేశారని, ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగినట్లు తెలిసింది. కేవలం స్థానిక మద్యాన్ని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారని ఎక్కడా విదేశీ మద్యం దొరకడం లేదా అని అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. సరిహద్దు జిల్లాలు, నియోజకవర్గాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈసీ బృందం అధికారులకు స్పష్టం చేసింది.
Central EC Team Hyderabad Tour : ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలంటే ప్రలోభాలను అరికట్టాల్సిన అవసరం ఉందని.. ఈసీ ఈ విషయంలో కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అధికారులు కూడా అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో క్రమంగా ఎన్నికల హింస తగ్గుతోందని, ఇదే సమయంలో ప్రలోభాలు పెరుగుతున్నాయని... హింస తగ్గేందుకు డబ్బు, మద్యం పంపిణీ కూడా ఒక కారణమని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Telangana Assembly Elections 2023 : సంబంధిత అధికారులు అందరూ సమర్థంగా, సమన్వయంతో పనిచేసి, స్వాధీనం చేసుకునే మొత్తాన్ని పెంచి, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా చూడాలని స్పష్టం చేసింది. పట్టుబడిన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల వివరాలను నియోజకవర్గాల వారీగా ప్రతి వారం పంపాలని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు, డూప్లికెట్ ఓట్ల విషయమై పదేపదే కొన్ని ప్రాంతాల నుంచే ఫిర్యాదులు రావడాన్ని ఈసీ బృందం ప్రశ్నించింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇన్ని ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఎందుకు సరిగ్గా వ్యవహరించడం లేదని అన్నట్లు సమాచారం. తుది జాబితా అనంతరం కూడా అదే తరహాలో ఫిర్యాదులు వస్తే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా.. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల హైదరాబాద్ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం గత రెండు రోజులుగా రాజకీయ పార్టీలు, ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, సీఈఓ, పోలీసు నోడల్ అధికారులు కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమావేశమైంది. ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికలపై చర్చించింది. చివరి రోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతో కమిషన్ సమావేశమవుతుంది. అంతకు ముందు ఓటరు అవగాహన కార్యక్రమాలపై ప్రదర్శనను తిలకించడంతో పాటు దివ్యాంగ, యువ ఓటర్లతో కమిషన్ చర్చించనుంది. మధ్యాహ్నం మీడియా సమావేశం అనంతరం మూడు రోజుల పర్యటన ముగించుకొని ఈసీ బృందం దిల్లీ బయల్దేరి వెళ్తుంది.
BRS MPS Letter To EC About Party Symbol : 'ఈసారైనా ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు కేటాయించకండి'