Telangana Assembly Elections 2023 : రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం.. కసరత్తు ప్రారంభించింది. రెండు రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం... శనివారం ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. ఈసీ డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని సీనియర్ అధికారుల బృందం.. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశమై.. ఓటర్ల జాబితా, మార్పులు, చేర్పులు, ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై సమీక్షించింది.
CEC focus on Telangana Assembly Elections 2023 : ఆధార్ అనుసంధానం, రెండో దశ ఫోటో సిమిలర్ ఎంట్రీల కసరత్తు.. సంబంధిత అంశాలపై ఆరా తీసింది. ఓటర్ జాబితా నుంచి తొలగింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తొలగించిన ఓట్లు, వాటి వివరాలను ఆరా తీశారు. ఎలాంటి లోపాలు లేని ఓటర్ల జాబితా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఈసీ బృందం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సీఈఓ వికాస్ రాజ్‌కు స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డుల అంశంపై కూడా చర్చించారు. ఈవీఎంల సన్నద్ధత విషయమై కూడా సమీక్షించారు.
ఈసీఐఎల్ తయారు చేసిన ఈవీఎంలే కేటాయింపు : రాష్ట్రానికి ఈ దఫా పూర్తిగా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ తయారు చేసిన ఈవీఎంలనే కేటాయించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న బెంగళూరు బెల్‌కు సంబంధించిన ఈవీఎంలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. కొన్ని ఎన్నికల పిటిషన్లు ఉన్న తరుణంలో ఆ ఈవీఎంలను కదల్చని పరిస్థితి నెలకొంది. పిటిషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈసీఐఎల్ సరఫరా చేసిన ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. వాటికి జూన్ ఒకటో తేదీ నుంచి మొదటి దశ చెకింగ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.
అన్ని స్థాయిల అధికారులకు దశల వారీగా శిక్షణ: ఎన్నికల విధులు నిర్వహించే అన్ని స్థాయిల అధికారులకు దశల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రణాళిక తయారు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులకు ఈసీ ఆధ్వర్యంలో త్వరలోనే రెండు రోజుల కార్యశాల నిర్వహించనున్నారు. అన్ని స్థాయిల ఓటర్ల భాగస్వామ్యం, పోలింగ్ శాతం పెరిగేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఈసీఐ బృందం రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితాకు కొత్త సాఫ్ట్‌వేర్: ఓటర్ల జాబితాకు సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్ ఈఆర్పీ నెట్ 2.0 పనితీరు, ఇబ్బందులపై కూడా సమీక్షించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కోసం తగిన రీతిన సిద్ధం కావాలని ఈసీఐ బృందం స్పష్టం చేసింది. ఈసీఐఎల్‌ను కూడా సందర్శించిన బృందం... ఈవీఎంలకు సంబంధించిన అంశాలపై సమీక్షించింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు లేవు. అయితే 2018 లో డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ జరిగినందున.. ఇప్పుడు కూడా డిసెంబర్ గడువుగా నిర్దేశించుకొని కార్యాచరణ చేపట్టనున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది విషయమై కూడా దృష్టి సారించారు. సంయుక్త ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన మాణిక్ రాజ్ కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. అటు సీఈఓ కార్యాలయానికి వసతిని బీఆర్కే భవన్‌లో ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం బుద్దభవన్‌లో వసతి అంత సౌకర్యంగా లేదు. కొత్త సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాక సీఈఓ కార్యాలయాన్ని బీఆర్కే భవన్ లోని 8, 9 అంతస్తులకు తరలించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: