Central Committee on Telangana Floods 2023 : తెలంగాణలో ఎన్నడూ లేనంతగా.. ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఈ కేంద్ర బృందం పని చేయనుంది. వివిధ శాఖల అధికారులతో కేంద్రం ఈ కమిటీని నియామకం చేసింది. ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా కేంద్ర బృందం అంచనా వేయనుంది.
Huge Damage Due to Heavy Rains in Telangana : అతి భారీ వర్షాలు, వాటి వల్ల పోటెత్తిన వరదలకు తెలంగాణ జిల్లాల్లో అపార నష్టం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు వాటిల్లిన నష్టం.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 20 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు.. అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాదాపు 8.92 లక్షల ఎకరాల్లో పంటలు.. నీట మునిగినట్లు తెలిపారు. సాగుకు దాదాపు రూ.900 కోట్ల రుపాయలకుపైనే నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల,జనగామ, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోఎక్కువ పంట నష్టం జరిగినట్లు... తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గోదావరికి భారీగా వరద రావడంతో... నదికి ఇరువైపుల దాదాపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయి.
భారీ నష్టంపై వివరాలు సేకరిస్తున్న అధికారులు : పంచాయతీరాజ్ శాఖకు భారీ నష్టం వాటిలినట్లు... అధికారులు నివేదిక రూపొందించారు. తెలంగాణ వ్యాప్తంగా 1416 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిని... 589 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తేల్చారు. 837 కల్వర్టులు కూలిపోయి... 400 కోట్ల వరకు నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో... దాదాపు 700 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు రోడ్లు, భవనాల శాఖ వివరించింది. జాతీయ, రాష్ర్ట రహదారులపై 47 వంతెనలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. తెలంగాణవ్యాప్తంగా 2వేల 509 ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ సంస్థలు... 21 కోట్ల మేర నష్టాన్ని చవిచూశాయి. 400కు పైగా చెరవులు, కుంటలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాజెక్టుల కాల్వలు.. దెబ్బతిన్నాయి. ఈ భారీ నష్టంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ, పునరావాస చర్యలపై అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యల గురించి ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిన సీఎం..ముంపు ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి :