Marks For Police Stations : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లను నమోదైన కేసుల సంఖ్యను బట్టి నాలుగు విభాలుగా విభజించి మార్కులు లెక్కగట్టారు. ఠాణాల్లో ఫిర్యాదుదారులతో సిబ్బంది వ్యవహారశైలి మొదలుకొని నేర దర్యాప్తు వరకు పనితీరుని 17 ఫంక్షనల్ వర్టికల్స్‌గా విభజించారు. ఆయా అంశాల మదింపు ఆధారంగా ఠాణాలకు మార్కుల్ని కేటాయించారు.
Telangana Police Stations : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు 73.73శాతం.. నల్గొండ జిల్లా తిప్పర్తికి 70.50శాతం.. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌కు 66.88శాతం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి 66.71శాతం.. ఇవన్నీ ఆయా పోలీస్‌స్టేషన్లకు కేటాయించిన మార్కులు. 2021 సంవత్సరంలో ఠాణాల్లోని పోలీస్ సిబ్బంది పనితీరుకు 90 మార్కులను పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేశారు. ఠాణాల్లో ఫిర్యాదుదారులతో సిబ్బంది వ్యవహారశైలి మొదలుకొని నేర దర్యాప్తు వరకు పనితీరును 17 ఫంక్షనల్ వర్టికల్స్‌గా విభజించారు. అలాగే ఠాణాకు వచ్చే వారికి కల్పిస్తున్న వసతులు, రికార్డుల నిర్వహణ, స్టేషన్లల్లోని పచ్చదనం తదితర అంశాలకు 10 మార్కుల్ని లెక్క కట్టారు. ఆయా అంశాల మదింపు ఆధారంగా ఠాణాలకు మార్కుల్ని కేటాయించారు.
తొలిసారిగా..
Telangana Police Stations: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 741 శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లను ఇలా తొలిసారిగా పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రమంతటా ఒకేరీతిన నేరాలు జరగవు కాబట్టి నమోదైన కేసుల సంఖ్యను బట్టి ఠాణాలను నాలుగు విభాగాలుగా విభజించి మార్కుల్ని లెక్కగట్టారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) కేంద్రంగానే ఈ పరిశీలన జరిగింది. ఇలా మొత్తం పోలీస్‌స్టేషన్ల నుంచి తొలుత 240 ఠాణాలను ఎంపిక చేశారు. అనంతరం ఆయా స్టేషన్లలోని వసతులకు సంబంధించి ఒకేరోజు చిత్రాలను తెప్పించారు. వాటిని పరిశీలించి తుది మార్కుల్ని కేటాయించారు. గురువారం ఈ జాబితాను అన్ని కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలకు పంపించారు.
పని విభజనతో 50.03కు పెరిగిన శిక్షల శాతం...
గతంలో పోలీస్‌స్టేషన్లలో పనిచేసే వారిలో కొందరే చురుగ్గా వ్యవహరించేవారు. ‘ఠాణాలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ... బాధ్యతల్ని కేటాయించడం’ అనే పని విభజనకు డీజీపీ మహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అలా ప్రతి స్టేషన్‌లో జరిగే రోజువారీ కార్యకలాపాల్ని ఫంక్షనల్ వర్టికల్స్‌గా విభజించి సిబ్బందికి విధులు కేటాయించారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి ప్రోత్సాహకాలను ఇచ్చే సంప్రదాయాన్ని కూడా ప్రారంభించారు. దీంతో 2021లో మెరుగైన ఫలితాలను సాధించగలిగారు. రెండేళ్ల క్రితం వరకు కనాకష్టంగా 30 శాతం ఉన్న శిక్షల శాతం గతేడాది 50.03శాతానికి చేరింది. అలాగే 10శాతం లోపే ఉన్న సమన్ల జారీ 96శాతానికి పెరిగింది.
ఇదీ చూడండి : నేడు యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. రాయగిరిలో భారీ బహిరంగ సభ