ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కందుకూరులో నివసిస్తున్న పి.వెంకటేశ్వర్లు(55) రెండు రోజులు క్రితం ఇంట్లో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అదే రోజు ఇంటికొచ్చారు. శనివారం పరిస్థితి విషమించడం వల్ల కుటుంబ సభ్యులు ఒంగోలులో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఒక రోజు వైద్యం అందించారు. ఆ తర్వాత రోగి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, వైద్యం అందించినా ప్రయోజనం లేదని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
దీంతో వారు రోగిని తీసుకుని ప్రైవేటు అంబులెన్స్‌లో కందుకూరు వచ్చారు. వారు ఉండేది అద్దె ఇల్లు కావడం వల్ల యజమానులు నిరాకరిస్తారని అపోహపడి నేరుగా శ్మశానం పక్కనే ఉన్న ఆరామక్షేత్రానికి తీసుకెళ్లారు. ఎలాగూ మరికొద్దిసేపట్లో చనిపోతాడని భావించిన బంధువులు ఖననం చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. దీన్ని గమనించిన స్థానికులు వ్యక్తి బతికుండగానే ఏవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారని కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం బయటకు రావడం, విలేకరులు అక్కడికి చేరుకోవడం వల్ల.. చేసేది లేక రోగిని పట్టణంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు