Sewage Samples : కొవిడ్ కేసులు పెరుగుతుండడం, ఒమిక్రాన్ వైరస్ దేశంలో వెలుగుచూస్తుండడంతో పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఏ రకం వైరస్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉందనేది తెలుసుకునేందుకు జన్యుక్రమాన్ని ఆవిష్కరిస్తూనే, కొవిడ్ వ్యాప్తిని ముందే పసిగట్టేందుకు మురుగునీటి కుంటలు, చెరువుల్లో నమూనాలను సేకరించబోతున్నారు. సీసీఎంబీ, ఐఐసీటీ కలిసి ఈ పని చేయబోతున్నాయి. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో సర్వేలెన్స్ చేపట్టబోతున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి తెలిపారు.
ముందే తెలుసుకోవచ్చు..
Corona Prevention Measures : మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షించడం ద్వారా కొవిడ్‌తో పాటు ఇతర మహమ్మారులను, అంటువ్యాధులను ముందే గుర్తించడానికి, వ్యాప్తిని తగ్గించడానికి, నివారించడానికి వీలవుతుంది. గతంలో పోలియో సమూల నిర్మూలనకు ఈ పద్ధతిని అనుసరించారు. ఇదే పంథాని కొవిడ్ రెండో వేవ్ సమయంలోనూ అనుసరించారు. వ్యాధి తగ్గుముఖం పట్టడం, నిధుల సమస్య తలెత్తడంతో ఆగస్టు తర్వాత నిలిపేశారు. ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో నమూనాల సేకరణ తిరిగి చేపట్టాలని, ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్లు కొద్దిరోజుల క్రితం పరిశోధకులు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ మొదలు పెడుతున్నట్లు తాజాగా చెప్పారు. వ్యక్తిగతంగా అందరికీ పరీక్షలు చేయడం క్లిష్టమైన దశలో మురుగునీటిపై నిఘా చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఖర్చు రూ.3 వేల లోపే..
Corona Cases in Hyderabad : మురుగునీటి నమూనాల పరీక్షలకు అయ్యే వ్యయం కూడా తక్కువే. ఒక్కో నమూనాకయ్యే ఖర్చు రూ.3 వేల లోపే ఉంటుందని నిపుణులు అంటున్నారు. పరిశోధన సంస్థలతోగానీ, ఎన్‌జీవోలతో గానీ మురుగునీటి నమూనాలను నిరంతరం అధ్యయనం చేయిస్తే.. కేవలం కొవిడ్ మాత్రమే కాదు నగరంలో కొత్త వ్యాధుల వ్యాప్తి వంటివి ముందే కనిపెట్టి నివారణ చర్యలు చేపట్టవచ్చు. పరీక్షల్లో ఒక ప్రాంతంలో అనూహ్య ఫలితాలు కన్పిస్తే, ఫలితాల ఆధారంగా ఆ ప్రాంతంలోని వారికి పరీక్షలు చేయించడం, క్వారంటైన్ జోన్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇవీ చూడండి:
- DH Srinivasarao on omicron: రాష్ట్రంలో వచ్చే ఆరు వారాలు అత్యంత కీలకమని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. జనవరి 15 తరువాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని, ఫిబ్రవరి నాటికి తీవ్రత మరింత ఎక్కువ కావచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.
- Covid Alert: ఒమిక్రాన్ వేరియంట్ కలకలం వేళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగా నమోదైన కేసులు.. తాజాగా రెట్టింపు స్థాయిలో వెలుగుచూస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ జాగ్రత్తలతో పాటు వ్యాక్సినేషన్‌ను విస్తృతంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వచ్చే ఆరువారాలు అత్యంత కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ సూచించింది.