హైదరాబాద్ జిల్లా మినహాయించి రాష్ట్రంలో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సహకార సంఘ ఎన్నికలు ఈనెల15న జరగనున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సహకార ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. పార్టీలకు.. పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధులు మాత్రం.. ఆయా రాజకీయ పార్టీలు బలపరిచిన వారే పోటీలో ఉంటారు.
ఎత్తులను చిత్తు చేసే ప్రణాళిక కరవు..
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసే ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్ధులను దించాల్సి ఉంది. కానీ ఆ దిశలో హస్తం నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటి వరకు సహకార ఎన్నికలపై కసరత్తు ప్రారంభించలేదు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో చొరవ చూపలేదు. 906 సింగిల్ విండో స్థానాల్లో జరిగే సహకార ఎన్నికల్లో ఎక్కడ హస్తం పార్టీ వ్యూహం కనిపించలేదు. ప్రభుత్వ రైతు వ్యతిరేఖ విధానాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి సహకార ఎన్నికల్లో లబ్ది పొందేదిశలో ప్రయత్నాలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉంది.
రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంద..?
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పటికీ సహకార సంఘ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు సీనియర్ నేతల్లో ఎవరికో ఒకరికి బాధ్యత అప్పగించాల్సి ఉంది. కానీ అది జరగలేదు. పార్టీ తీరు ఇలానే ఉంటే.. భవిష్యత్తులో మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని నేతల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానం మేల్కొని.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సహకార ఎన్నికల్లో.. సీనియర్ల సహాయనిరాకరణ..?
- రైతు బంధుపథకం, రుణమాఫీ, గిట్టుబాటు ధర, దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, తదితర వాటి అమలులో లోపాలను ఎత్తిచూపి సహకార ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పార్టీ పరంగా ప్రయత్నం చేయడం సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
- పెద్ద ఎత్తున రైతుల ఓట్లు తొలిగించారని చెబుతున్న కాంగ్రెస్.. ఎక్కడ పోరాటం చేసిన దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికలను సవాలుగా తీసుకో వలసిన కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికలను తీవ్రంగా పరిగణించకపోవడం వల్ల కార్యకర్తలు ఉత్సాహం కోల్పోయారు.
- అధికార తెరాసకు తామే ప్రధాన ప్రతిపక్షమని నిత్యం చెప్పే కాంగ్రెస్ పార్టీ నేతలు.. సహకార ఎన్నికల విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నది ప్రశ్నగా మిగిలింది.