Orphans as state children : తెలంగాణలోని అనాథ పిల్లలందరినీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తించి, ప్రభుత్వమే తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. పిల్లల సంరక్షణ కోసం అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని.. వారిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సూచించింది. రోడ్లపై కూడళ్ల వద్ద అనాథలతో భిక్షాటనను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
కరోనాతో అనాథలుగా మారిన వారిని ఆదుకునేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలు నిర్ణయాలు తీసుకుంది. శనివారమిక్కడ శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.
Cabinet sub-committee recommendations: ఉపసంఘం సిఫార్సులివీ..
- అనాథ పిల్లల కోసం కేజీ నుంచి పీజీ వరకు గురుకులాల తరహాలో ప్రత్యేక సమీకృత ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి. జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించాలి.
- కూడళ్లలో భిక్షాటన చేసేవారిని ప్రత్యేక పునరావాస కేంద్రాల్లో చేర్పించాలి.
- అనాథ పిల్లలకు ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలి. ఈ కార్డుతో ఆదాయ ధ్రువీకరణ, కులధ్రువీకరణ పత్రాలకు మినహాయింపు కల్పించాలి.
- అనాథ పిల్లల శరణాలయాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి, వసతులు కల్పించి అండగా ఉండాలి.
- ఈ పిల్లల కోసం ఖర్చుచేసే నిధులను గ్రీన్‌ఛానెల్‌లో పెట్టి మిగిలిపోయిన వాటినిమరుసటి ఏడాదికి వినియోగించేలా నిబంధనలు చేర్చాలి.
- కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనాథల సంరక్షణ కోసం ముందుకొచ్చేవారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాలి.