ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుధీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... ఆర్టీసీ వ్యవహారంపై విస్తృత స్థాయిలో చర్చించింది. సంస్థ స్థితిగతులు, కార్మికుల సమ్మె నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ చర్చించింది. పేద ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తోన్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ.. కాపాడుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించింది.
సోమేశ్ అధ్యక్షతన కమిటీ..
సంస్థ పరిరక్షణ కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో, వారి డిమాండ్లు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇవాళ ఆర్టీసీ కార్మికులతో చర్చించనుంది. కార్మికుల డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
సమ్మె విరమించండి..
అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె విరమించుకోవాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున, సమ్మె యోచన విరమించుకుని సహకరించాలని కార్మికులను కోరింది. ఇప్పటికే తమ డిమాండ్లు చెప్పారని, ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని సూచించింది.
ఇబ్బందులకు గురి చెయ్యోద్దు..
డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్న కేబినెట్... ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో సమ్మెకు పోయి కార్మికులు సొంత సంస్థనే నష్టపరచవద్దని విజ్ఞప్తి చేసింది. కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని మంత్రి మండలి కోరింది. ప్రజలంతా పండుగలకు సొంతూర్లకు పయనమయ్యే సందర్భంలో సమ్మెకు పోయి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి:నిత్యం రెగెట్టా పోటీలు జరిగేలా చూడాలి: సీఎం కేసీఆర్