జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేస్తున్న సాహితీ పురస్కారానికి ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ వాణి బలంగా వినిపించారు.
సినారె జయంత్యుత్సవంలో..
ఈ నెల 29న తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తంగా నిర్వహించనున్న సి.నారాయణరెడ్డి 90వ జయంత్యుత్సవంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారం కింద రూ.25 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్
ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు, కిమ్స్ ఉషాలక్ష్మీ రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి.రఘురాంను ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. బ్రిటన్, ఐర్లాండ్‌లలో అత్యంత ప్రసిద్ధి చెందిన సర్జన్ల సంస్థ ఏఎస్‌జీబీఐ (అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్).. గౌరవ సభ్యత్వం (ఫెలోషిప్)తో సత్కరించింది. మంగళవారం ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్‌జీబీఐ అధ్యక్షుడు నీల్ వెల్క్.. డాక్టర్ పి.రఘురాంకు ఈ గౌరవ సభ్యత్వం అందజేశారు.
తొలి భారతీయ వైద్యుడు
వందేళ్ల కిందట స్థాపించిన ఈ సంస్థలో ఇప్పటివరకూ ఒక్క భారతీయ వైద్యుడికి కూడా ఫెలోషిప్ లభించలేదు. డాక్టర్ రఘురాం ఈ ఘనత సాధించిన తొలి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడిగా గుర్తింపు పొందారు. భారత్‌లో మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు.. భారత్, యూకే మధ్య వైద్య పరిజ్ఞాన మార్పిడిలో వారధిగా వ్యవహరిస్తున్నందుకు గుర్తింపుగా రఘురాంకు ఈ పురస్కారం అందజేసినట్లు ఏఎస్‌జీబీఐ తెలిపింది. ఈ పురస్కారం సమాజం పట్ల తన బాధ్యతలను మరింతగా పెంచిందని డాక్టర్ రఘురాం పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రోబో సినిమాలో 'సనా' మాదిరి పరీక్ష రాద్దామనుకున్నాడు.. చివరికి!