ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనలతో వాహన డీలర్లు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మార్చి 31 నుంచి రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ నిలిపివేయనున్నందున... ఇప్పటికే ఉన్న వాహనాలను అమ్మేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి.
మార్చి 31 వరకే బీఎస్4 రిజిస్ట్రేషన్లు
కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన భారత్ స్టేజ్ ప్రమాణాల్లో బీఎస్-6 నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతమున్న బీఎస్-4 వాహనాలకు మార్చి 31 నుంచి రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ నిలుపివేయబోతుంది. ఆ లోపు రిజిస్టరైన వాటిని యథావిధిగా వినియోగించుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్-6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు.
బీఎస్4 వదిలించుకునేందుకు భారీ ఆఫర్లు..
ఆర్థిక మాంద్యంతో వాహన విక్రయాలు మందగమనంలో పడ్డాయి. ఇప్పటికే ఉన్న వాహనాలు వచ్చే నెల చివర్లోగా విక్రయించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వాటిని బీఎస్-6 ప్రమాణాలకు తగినట్లు మార్చాల్సి ఉంటుంది. అది వ్యయంతో కూడుకున్న పని కావడం వల్ల... ఆ వాహనాలను వదిలించుకునేందుకు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ద్విచక్రవాహనాలకు రూ.10 వేల వరకు, కార్లకు రూ.లక్షా 25 వేల నుంచి రూ.లక్షన్నర రూపాయల వరకు రాయితీలు ఇస్తున్నాయి. హై ఎండ్ కార్ల విషయంలో ఆ రాయితీలు మరింత ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.
పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మార్చి 31 నాటికి బీఎస్-4 వాహనాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకుని తిప్పుతున్న వాహనాలు 2,96,336 వరకు ఉన్నాయి. వీరంతా పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. లేని పక్షంలో అలాంటి వాహనాలను ఏప్రిల్ 1 తర్వాత అనుమతించకూడదని నిర్ణయించారు.
బీఎస్-6 వాహనాలు కాలుష్యం తక్కువగా వెదజల్లుతాయి. మైలేజీ 10 శాతం వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వాహనాల మాదిరిగా తరచూ సర్వీసు చేయించాల్సిన అవసరం ఉండదంటున్నారు.
ఇవీ చూడండి: పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలి: సీఎస్