BRS Parliament Elections 2024 : రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ శాసనమండలిలో పూర్తి మెజారిటీ ఉంది. సభలో మొత్తం 40 మంది సభ్యులకుగాను బీఆర్ఎస్ సభ్యులు ఏకంగా 28 మంది ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేసుకోవచ్చని, ఇదే సమయంలో పాలక పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టొచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ప్రత్యేకించి త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం శాసనమండలి సభ్యులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందనేది పార్టీ ఆలోచన. అందులో భాగంగా ఎమ్మెల్సీలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. ఇన్నాళ్ల పాటు ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరిగాయని, అలా చేయడం సరికాదని ఇటీవలి ఎన్నికలు తేల్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక నుంచి పార్టీలోని అన్ని స్థాయిల వారిని కలుపుకుని వెళ్లేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
సమర్థులకు అవకాశం : గ్రామస్థాయి మొదలు పొలిట్ బ్యూరో వరకు కొత్తగా నియమించాలని అధినేత నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. సమర్థులైన నాయకులు, కార్యకర్తలకు కమిటీల్లో చోటు దక్కుతుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు. ప్రత్యేకించి పార్టీ శాసనసభ్యులు లేని నియోజకవర్గాలపై దృష్టి సారించాలని సూచించారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని అన్నారు.
ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై కాంగ్రెస్ కసరత్తు - తెరపైకి ఆ ఆరుగురి నేతల పేర్లు
ఎమ్మెల్సీలుగా ప్రోటొకాల్ ఉంటుందని, తద్వారా ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించడం సులభం అవుతుందని చెప్పారు. మండలిలో పూర్తి బలం ఉన్నందున బడ్జెట్ సమావేశాల సందర్భంగా వీలైనంత ఎక్కువ సమయాన్ని ఉపయోగించుకుని పార్టీ విధానాలను బలంగా వివరించాలని కేటీఆర్ ఎమ్మెల్సీలను కోరారు. పాలక పక్షం ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. సమావేశాలు సహా అన్ని సందర్భాలలో ఎమ్మెల్సీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని, పార్టీ తరపున అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కేటీఆర్ వారికి వివరించారు.
మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతకు ప్రతిపక్ష హోదా దక్కనుంది. ఆ నేత ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తి చేయాలని మొదట భావించినా, ఆ తర్వాత వాయిదా వేశారు. త్వరలోనే పార్టీ ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ సమావేశం అవుతారని, ఆ సమయంలోనే మండలి పక్షనేత సహా ఇతర ఎంపికలు ఉంటాయని కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
BRS MP Candidates : లోక్‌సభ నియోజకవర్గాల వారీగా లేదా జిల్లాల వారీగా ఎమ్మెల్సీలను సమన్వయకర్తలుగా నియమించే అవకాశం ఉంది. అయితే సమన్వయకర్తలుగా నియమించి కేవలం నామమాత్రంగా ఉంచితే ఫలితం ఉండదని కొందరు ఎమ్మెల్సీలు, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ ఛైర్మన్ ముందు పిటిషన్ దాఖలు చేయాలని సమావేశం అభిప్రాయపడింది.