BRS MLA Candidates Second List 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే 115 స్థానాల జాబితాను ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన పార్టీ అధినేత కేసీఆర్.. మిగిలిన 4 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక్కడి అభ్యర్థిగా ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావును ప్రకటించగా.. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో నిలపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.
Malkajgiri TRS MLA Candidate Marri Rajasekhar Reddy : మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా(BRS Candidates) పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ తలపడిన అనుభవం.. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు రాజశేఖర్‌రెడ్డికి ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కేసీఆర్ అంతర్గతంగా వారికి సమాచారమివ్వడంతో.. ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. 15 వేల మందితో ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
BRS MLA Tickets Telangana 2023 : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట.. ఏడుగురు మహిళలకు ఛాన్స్
Jangaon BRS MLA Candidate Palla Rajeshwar Reddy : జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ స్థానం నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి బరిలో నిలవాలని బలంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాలో ఈ స్థానాన్ని ప్రకటించకుండా ముత్తిరెడ్డికి సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy)ని పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నర్సాపూర్‌లో మళ్లీ పోటీ చేసేందుకు మదన్‌రెడ్డి విస్తృతస్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్ఠానం సునీతా లక్ష్మారెడ్డి వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. వారికి అధిష్ఠానం నుంచి సమాచారం తెలియడంతో.. ఆ నియోజకవర్గంలో ప్రచార ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.
Goshamahal BRS MLA Candidate 2023 : గోషామహల్ స్థానానికి నందకిశోర్, ఆశీష్‌కుమార్ యాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరికి సీటు వచ్చే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను అధికారకంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. తొమ్మిది స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో శాసనసభ్యలనే ఖరారు చేసింది.