BRS Leaders Reacts on Minister Jupally Comments : మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు మాట్లాడి, కట్టుకథలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌పై(KTR) అనవసర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లేశ్ కుటుంబ సభ్యులు డీజీపీని కలిసి రెండు వారాలు గడచినా కనీసం చర్యలు తీసుకోలేదన్నారు.
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మంచివి కాదు : కేటీఆర్
BRS Activist Mallesh Muder Incident : మంత్రి జూపల్లి కనీసం హత్యను ఖండించకపోగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సచివాలయంలో పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించడం దురదృష్టకరమన్నారు. మల్లేశ్ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడుతున్నారు కాబట్టే బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని దుయ్యబట్టారు. ఈ హత్యపై ఉన్నత స్థాయి అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రి పక్కన కూర్చోబెట్టుకోవడం విచారణను ప్రభావితం చేయడం కాదా? అని పేర్కొన్నారు. హత్యకు సంబంధం ఉన్న వ్యక్తుల కాల్ డేటా బయటపెట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Guvvala Balraju fires on Minister Jupally : ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ తీరు ఉందని బీఆర్ఎస్ నేత గువ్వల బాల్‌రాజు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో అసాధ్య హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని విమర్శించారు. పాలనపై దృష్టి కేంద్రీకరించకుండా, హత్యా రాజకీయాలపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దాహం ఒక హత్యతో తీరేలా కనిపించడం లేదని, హత్యా రాజకీయాలకు తెర తీసిందని ఆరోపించారు.
మంత్రిగా జూపల్లి నియంత్రించాలని మాత్రమే కేటీఆర్ అన్నారు తప్ప, ఎలాంటి ఆరోపణలు చేయలేదని గువ్వల పేర్కొన్నారు. జూపల్లి ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అనవసర ఆరోపణలు చేశారని తెలిపారు. గతంలో కేసీఆర్ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన జూపల్లి, లేనిపోని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకురావడం సబబు కాదని హితవు పలికారు.
"మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు మాట్లాడి కట్టుకథలు సృష్టిస్తున్నారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌పై అనవసర వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యపై ఉన్నత స్థాయి అధికారితో సమగ్ర విచారణ జరిపించాలి". - బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
మల్లేశ్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి తగదు : మంత్రి జూపల్లి