BRS Election Campaign in Full Josh : అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు.. ప్రచారంలో జోరు పెంచారు. మేడ్చల్‌లో రోడ్‌షో నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy).. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నోచేసినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. కళ్లబొల్లి మాటలు చెప్పేవాడిని ఎవరూ నమ్మరన్న గోపీనాథ్.. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న గులాబీ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముగ్గు బస్తీ, కొత్త బజార్ పరిసర ప్రాంతాల్లో ముఠా గోపాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఉందని పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావు నగర్‌లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు చాలా అపార్ట్మెంట్, కాలనీల నాలాలకు ఒకప్పుడు భయంకరమైన పరిస్థితి ఉండేది. నేడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే రూ.8 వేల కోట్ల వరకు వెచ్చించి అభివృద్ధి పనులు చేసి చూపించాం. ఈ ఏడాది కురిసిన అతి వర్షాలకు ఎటువంటి నష్టం కానీ ఇబ్బందులు కానీ తలెత్తలేదు. ఈ సందర్భం చాలు సాధించిన ప్రగతిని మన కళ్లముందే తెలియజేయటానికి. - తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్దక శాఖ మంత్రి
BRS Door to Door Election Campaign : జిల్లాల్లోనూ గులాబీ నేతలు విస్తృతంగా జనం చెంతకు వెళ్తున్నారు. మెదక్ జిల్లా(Medak District) నార్సింగి మండలం జప్తి శివునూరు గ్రామంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడులో గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో యువకులు బీఆర్ఎస్లో చేరారు. త్వరలో భూపాలపల్లికి ఇంజినీరింగ్ కళాశాలను తీసుకొస్తానని రమణారెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేపట్టారు.
సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో కార్యకర్తలతో శానంపూడి సైదిరెడ్డి సమావేశమయ్యారు. నల్గొండ జిల్లా హాలియాలో నోముల భగత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మగౌరవ సభకు హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi Rathod).. కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తారని వివరించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు.. మరోసారి అధికారాన్ని అప్పగిస్త్తే కేసీఆర్ పాలనతో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని వివరిస్తున్నారు.