BRS Assembly Elections Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్(BRS) నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రి కేటీఆర్ వల్లే పరిశ్రమల ఖిల్లాగా రంగారెడ్డి జిల్లా అవతరించిందని.. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే యాదయ్యకు మద్దతుగా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
BRS Election Plan 2023 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుకు మద్దతుగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవి ప్రసాద్ హాజరయ్యారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని.. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. కామారెడ్డి జిల్లా సోమేశ్వర్ శివారులో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో సభాపతి, బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను.. బోర్డులపై ప్రజలకు వివరించాలని పోచారం కార్యకర్తలకు సూచించారు.
MLC Kavitha fires on Rahul Gandhi : తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమేనని.. బీఆర్ఎస్ది పేగు బంధం అంటూ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుప్తాతో కలిసి.. కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామంటూ.. రాహుల్ గాంధీని ఉద్దేశించి కవిత విమర్శించారు. ప్రజలకు దిల్లీ నుంచి పాలన చేసే వారొద్దని.. హైదరాబాద్ వారే కావాలని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు విశ్వసించట్లేదని.. పూర్తి స్థాయిలో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేకపోయిందని హనుమకొండలో విమర్శించారు.
"కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ ఉద్యమ సాధనలో.. ఎంతో మంది అమరవీరుల చావుకు కారణమయ్యారు. వాళ్లు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. వాళ్లది ఎన్నికల బంధం.. మనది పేగు బంధం. - కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Telangana Assembly Elections 2023 : హనుమకొండ జిల్లా నర్సానగర్ చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కొత్తగూడెం బీఆర్ఎస్లో వివాదం తారాస్థాయికి చేరటంతో.. ఎన్నికల ఇంఛార్జ్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర రంగంలోకి దిగి సమస్య సద్దుమణిగేలా చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావుతో ఏర్పడిన వివాదంతో సుమారు 25 మంది కౌన్సిల్ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటున్న బీఆర్ఎస్ అభ్యర్థులు.. మేనిఫెస్టోను పక్కాగా అమలు చేసి సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.
Political Heat in Telangana 2023 : రాష్ట్రంలో ఎలక్షన్ హీట్.. ప్రచారాలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు