MLC kavitha in BrahmaGarjana Sabha : రాజకీయంగా బ్రాహ్మణులకు అన్ని పార్టీలు సముచిత ప్రాధాన్యం కల్పించాలని హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బ్రహ్మగర్జన సభలో వక్తలు నినదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణలోనూ బ్రాహ్మణులకు కేటాయిస్తున్న అసెంబ్లీ సీట్లు అంతంతమాత్రమేనన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత ఆలయ అర్చకులకు వేతనాలు సహా దూపదీప పథకం కింద ప్రతీ నెల నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
బ్రాహ్మణులు ఆర్థికంగా స్థిరపడకపోవడంతో.. పౌరోహిత్యం వైపు కొందరు, తెలుగు ఉపాధ్యాయులుగా మరికొందరు స్థిరపడ్డారని కవిత అభిప్రాయపడ్డారు. సమాజం బాగుండాలంటే బ్రహ్మణులు బాగుండాలని ఆకాంక్షించారు. బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలను తయారుచేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వివరించారు. ప్రభుత్వం విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఇస్తున్న ఉపకారవేతనాలతో సుమారు 780 మంది పేద బ్రహ్మణ విద్యార్థులు లబ్ధిపొందుతున్నారని కవిత పేర్కొన్నారు.
"ఇవాళ బ్రహ్మణులకు భాష పరంగా అత్యంత పట్టున్నప్పటికీ.. ఆస్తుల పరంగా చాలా వెనుక పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మణులు పాత్ర అమోఘం. అర్చక స్వాములకు ప్రభుత్వం తరపున జీతాలు ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాం. అలాగే దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు రూ.2500 ఉన్న మొత్తాన్ని ఇవాళ రూ.10,000కు పెంచాం. ప్రస్తుతం 6000 దేవాలయాలకు ఇవ్వగా.. వాటి సంఖ్య 8000లకు పెంచుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం." కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
- Lashkar Bonalu : మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, ఎమ్మెల్సీ కవిత
- రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు
Brahma Garjana Sabha at Hyderabad : రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు పిలిచి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. అసెంబ్లీ స్థానాల్లో నిలబడే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్దేశించే స్థాయికి ఎదిగితేనే పార్టీలు గుర్తిస్తాయని ఆయన అన్నారు. భారతదేశంలో సంస్కృతి పరిరక్షణకు బ్రాహ్మణ జాతి అనాదిగా కృషి చేస్తుందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
ప్రభుత్వ ఖజానా నుంచి ఆలయాలకు ఖర్చు పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. అలాగే అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చింది మోదీ సర్కార్ అని గుర్తు చేశారు. విదేశీ విష సంస్కృతి బారి నుంచి కాపాడింది తామేనని ఆయన వివరించారు. తెలంగాణ బ్రహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ బ్రహ్మణ సభలో ఎమ్మెల్సీ కవిత, వాణీదేవి, పురాణం సతీష్, రామచందర్‌రావు, బ్రాహ్మణ ప్రముఖులు కేవీ రమణాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, దేవీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
"ప్రభుత్వ ఖజానా నుంచి ఆలయాలకు ఖర్చు పెట్టింది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఇన్నాళ్లు రిజర్వేషన్లు అంటే వెనకబడిన వర్గాల వారికే ఉండేది. అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చింది మోదీ సర్కార్." - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ నేత
ఇవీ చదవండి: