ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని బాంబే హైకోర్టు వెల్లడించింది. వరవరరావును నానావతి ఆస్పత్రి నుంచి తలోజా జైలు ఆస్పత్రి లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆస్పత్రికి తరలించాలని డిసెంబరు 21న మహారాష్ట్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ.. కోర్టును అభ్యర్థించాయి. మరోవైపు తన భర్త ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని, సరైన వైద్య సదుపాయం కల్పించడం లేదని వరవరరావు భార్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై గురువారం వాదనలు విన్న జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ ఎమ్‌ఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం.. జనవరి 13 వరకు వరవరరావు ఆస్పత్రిలోనే ఉంటారని తీర్పునిచ్చింది. ఈ మేరకు తాజా వైద్య పరీక్షల నివేదికలు చూడాల్సిన అవసరం ఉందని కోర్టు వెల్లడించింది.
ఆయన ఆరోగ్య స్థితిపై మహారాష్ట్ర ప్రభుత్వం తాజా వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు సమర్పించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నడవగలుగుతున్నారని పేర్కొంది. వరవరరావు తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2020 నవంబర్ నుంచి ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పలుమార్లు ఆస్పత్రికి
2018 జూన్‌లో ఎల్గర్ పరిషద్ కేసులో వరవరరావు అరెస్టై తలోజా జైల్లో ఉన్నారు. అనంతరం పలుమార్లు ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రులలో చికిత్సలు పొందుతున్నారు. 2020 జూలై 16న ఆయనకు కరోనా నిర్ధరణ కాగా నానావతి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కోలుకున్న తర్వాత జూలై 30న డిశ్ఛార్జ్ అయ్యారు. మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబరులో అదే ఆస్పత్రిలో చేరారు. ఎల్గర్ పరిషద్ కేసులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వరవరరావుతో పాటు మరికొందరు కార్యకర్తలు అరెస్టయ్యారు.
ఇదీ చదవండి: అఖిలప్రియతో ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు : ప్రతాప్రావు