కరోనా ప్రభావంతో ఏపీలో రక్త నిల్వలు నిండుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తివల్ల ప్రత్యేక రక్తదాన శిబిరాలు జరగడంలేదు. దీని ప్రభావం ముఖ్యంగా తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులపై కనిపిస్తోంది. తలసేమియాతో బాధపడే వారి వయసు, బరువును అనుసరించి కిలోగ్రాముకు 12 ఎంఎల్ చొప్పున రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. దీని ప్రకారం కొందరికి నెలలో రెండు సార్లు, మరికొందరికి 40 రోజులకు మూడు సార్లు ఎక్కించాల్సి ఉంటుంది. సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తుల్లో వైద్యుల సిఫార్సుతో కొందరికి నెలకోసారి రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రక్తదాన శిబిరాలు తగ్గిపోవడం, దాతలు ముందుకు రాకపోవడతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
శస్త్ర చికిత్సలు వాయిదా
ప్రస్తుతం పాజిటివ్ గ్రూపులకు చెందిన రక్తం నిల్వల కంటే నెగెటివ్ గ్రూపుల (ఎ, బీ, ఏబీ, ఒ నెగిటివ్) కొరత తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి ప్రభావం ఎక్కువయ్యే కొద్దీ.. అత్యవసరంగా రక్తం అవసరమయ్యే రోగులు ఇబ్బందులుపడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పాజిటివ్ రక్తమూ... దొరికే పరిస్థితులుండవని అభిప్రాయపడుతున్నారు.
రోడ్డు ప్రమాదాలు, శస్త్రచికిత్సలు తగ్గినందువల్ల రక్తం అవసరం గతంలో కంటే తగ్గింది. కానీ.. నెగెటివ్ గ్రూపులు అందుబాటులో లేనందున పలు చోట్ల శస్త్ర చికిత్సలు వాయిదా పడుతున్నాయి. ఏటా విద్యా సంవత్సరం పునఃప్రారంభంలోనే ప్రత్యేక శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. వైరస్ ప్రభావంతో ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. దీంతో రక్తదాన శిబిరాల నిర్వహణకు అవకాశం లేకుండాపోయింది. ప్రముఖుల జయంతులు, వర్ధంతులు, జన్మదినాల సందర్భంగా జరిగే రక్తదాన శిబిరాల హడావుడి సైతం కనిపించడం లేదు.
అందుబాటులో 3,497 యూనిట్లు
ఏపీ వైద్యారోగ్యశాఖ వైబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఆదివారం 166 రక్త నిల్వ కేంద్రాల్లో 3,497 యూనిట్ల రక్తమే అందుబాటులో ఉంది. సాధారణ రోజుల్లోనైతే కనీసం 7వేల యూనిట్ల వరకు ఉండేది. కొన్ని కేంద్రాల్లో పాజిటివ్ గ్రూపు రక్తం తక్కువగా ఉంది. అనంతపురం, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఏబీ పాజిటివ్, నెగెటివ్ రక్తం నిల్వలు లేవు. ఓ, బీ నెగెటివ్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చిన్నాపెద్దా కలిపి 18 కేంద్రాలు నడుస్తున్నాయి. అన్ని కేంద్రాల్లో కలిపి రోజూ కనీసం నాలుగైదు వేల యూనిట్ల రక్తం అందుబాటులో ఉండేది.
గత శుక్రవారం నాడు 1,132 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. విజయవాడలోని రక్తనిధి కేంద్రంలో కనీసం 100-150 యూనిట్ల రక్తం ఉండేది. శుక్రవారంనాడు 12 యూనిట్లే ఉంది.
రక్త సేకరణ తగ్గింది
ప్రతినెలా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించేవాళ్లమని ఓ సేవా సంస్థ ముఖ్య ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం 75-90 యూనిట్లే సేకరిస్తున్నామన్నారు. వైరస్ వ్యాప్తి కారణంగా దాతలు ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఇబ్బందుల్లేకుండా ఫేస్‌బుక్, ఇతర మార్గాల ద్వారా దాతల్ని అప్రమత్తం చేస్తున్నామని, అవసరమైనప్పుడు సేకరిస్తున్నామని ఏపీ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.