Telangana Assembly Elections 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాలు, నేతల మధ్య విభేదాలు, పార్టీ సంస్థాగత మార్పులతో గందరగోళంలో ఉన్న కమలనాథుల్లో... నూతన ఉత్తేజం నింపేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించింది. వంద రోజుల ఎన్నికల ప్రణాళికతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే విభేదాలు పక్కనపెట్టి.. సమష్టిగా పనిచేయాలని భావిస్తోంది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
BJP Strategies for Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలోని 31 ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని... వారం రోజుల పాటు ఇంటింటికి బీజేపీ, మహాజన్ సంపర్క్ అభియాన్, జులై 16న టిఫిన్ బాక్స్ కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన కమలం పార్టీ... పలు కార్యక్రమాలు నిర్వహించింది. అసెంబ్లీలోని 119 స్థానాల్లో.. 31 స్థానాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌గా ఉన్నాయి. ఈ స్థానాల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేసేందుకు సులభమవుతుందని కమలదళం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేసీఆర్ చేసిన మోసం.. కేంద్రం చేసిన సహాయం, కేంద్రమంత్రి వర్గంలో వీరికి ఇచ్చిన ప్రాధాన్యాలను అస్త్రాలుగా చేసుకుని.. పార్టీని బలోపేతానికి ప్లాన్ చేస్తోంది. ఈ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలకు ... ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన కేంద్రమంత్రులు, జాతీయ నాయకులను పిలిపించేందుకు సమాలోచనలు చేస్తోంది.
విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ : వారం రోజుల పాటు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూనే... కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను.. కమలం వివరించనుంది. జులై 16న టిఫిన్ బాక్స్ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ప్రతి కార్యకర్త ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుని అందరితో కలిసి బుజిస్తూ.. పార్టీ కార్యక్రమాలను చర్చించుకోవడం, తెలుసుకోవడం, వివరించడం.. దీని ముఖ్యం ఉద్ధేశం. ఈ కార్యక్రమం విజయవంతమైతే పార్టీ శ్రేణుల్లో సత్సంబంధాలు ఏర్పడుతాయని భావిస్తోంది. ఈ నెలాఖరు వరకు మహాజన్ సంపర్క్ అభియాన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 15వరకు మరో విడత నిర్వహించాలనే భావనలో ఉంది.
నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం : రాష్ట్ర పదాధికారుల సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను ఇవాళ జరిగే సమావేశంలో వివరించి.. కార్యక్రమాల విజయవంతంపై దిశానిర్థేశం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఈ రోజు జరగనున్న సమావేశంలో ఏ జిల్లాల్లో ఎప్పుడు పర్యటించాలి.. ఏ కార్యక్రమం నిర్వహించాలి అనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి :