Bjp Meeting in Mahabubnagar: రాబోయే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో పాగా వేయడమే లక్ష్యంగా... భాజపా ఇవాళ మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానం వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. 'జనం గోస- భాజపా భరోసా' పేరిట నిర్వహించనున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సహా... రాష్ట్రంలోని కీలక నేతలంతా హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్ సహా మిగిలిన ఐదు జిల్లాల నుంచి భాజపా శ్రేణులు, ప్రజలు తరలిరానున్నారు. లక్షమందితో సభ నిర్వహించేందుకు భాజపా నేతలు కసరత్తు పూర్తి చేశారు.
పాలమూరు జిల్లాలో 21 రోజుల పాటు పాదయాత్ర సాగించిన బండి సంజయ్ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యల్ని సంజయ్... నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు భాజపా అధికారంలోకి వస్తే... పాలమూరు సమస్యల్ని ఎలా పరిష్కరించబోతుందో ఈ సభ ద్వారా కమళదళం వెల్లడించాలని భావిస్తోంది. దీనికి తోడు 8 ఏళ్ల తెరాస పాలన వైఫల్యాలను సభలో ఎండగట్టనున్నారు.
భాజపా జాతీయాధ్యక్షుడు మొదట దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యాహ్నాం 12గంటల 40నిమిషాలకు చేరుకుంటారు. నొవాటెల్‌లో భోజనం ముగించుకుని... రోడ్డు మార్గం ద్వారా మహబూబ్‌నగర్‌కు బయల్దేరతారు. మధ్యాహ్నాం 3 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు. సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయాలు, బండి సంజయ్ పాదయాత్ర, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైనా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశముంది. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు... నడ్డా సమక్షంలో భాజపాలో చేరే అవకాశముంది.
జాతీయాధ్యక్షుడుగా ఎవరున్నా మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభలకు హాజరు కావడం పార్టీలో అనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు భాజపాకు పట్టున్న నియోజకవర్గాల్లో పాగావేయడమే లక్ష్యంగా కమళదళం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాలమూరు రాజకీయాల్లో మార్పునకు నాంది పలికేలా నిర్వహించాలని.. శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇవీ చూడండి :
రాహుల్ ఓయూ టూర్... మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఎస్‌యూఐ