ఒక కుటుంబంలో ఒక్కరికే ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం అన్యాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అగ్రహం వ్యక్తం చేశారు. తెరాస మెనిఫెస్టోలో ప్రకటించిన 57 ఏళ్ల వయోపరిమితి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కొత్త ఆసరా పెన్షన్లు ప్రచార ఆర్భాటం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ మేరకు పెన్షన్ల అమలు విధానంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలపై సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండి అర్హులైనవారు దాదాపు 11 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చేస్తున్నారని బండి సంజయ్ లేఖలో వివరించారు.
కొత్త పెన్షన్లు ఏవి..?: గతంలో 2018లో తెరాస సర్కారు ఇచ్చిన హామీ అమలైతే ఒక్కో ఆసరా పింఛను లబ్దిదారులకు ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.78,624 చెల్లించాలని బండి సంజయ్ వివరించారు. ప్రభుత్వం వారికి ఇప్పటివరకు బకాయిపడ్డ మొత్తాన్ని అర్హులైన వృద్ధులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలే తప్ప అందుకు తగ్గ కసరత్తు చేయకపోవడం శోచనీయమన్నారు. ఆసరా పెన్షన్ లబ్దిదారుడు మరణిస్తే... ఆ కుటుంబంలో అర్హులుంటే వెంటనే వారికీ పెన్షన్ వర్తింపచేయాలన్నారు. తక్షణమే నూతన మార్గదర్శకాలను విడుదల చేసి కొత్త పెన్షన్లకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
'కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది'