Bandi Sanjay Tweet on KCR Family: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై సెటైరికల్ ట్వీట్ చేశారు. దొరవారి గడుల్లో నలిగిపోయిన న్యాయమా అంటూ ఆశ్చర్యం వ్యక్తపరిచారు. దేశంలో అత్యధిక వేతనం 4.1 లక్షలు తీసుకుంటోంది.. సీఎం కేసీఆర్ అని బండి పేర్కొన్నారు. కేసీఆర్ కొడుకు పరువు నష్టం విలువ రూ.100 కోట్లని.. కేసీఆర్ కూతురు వాచ్ ధర రూ. 20 లక్షలంటూ సెటైర్లు విసిరారు.
Bandi Sanjay Tweet Today: మరీ కుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలు, ర్యాగింగ్ బూతానికి బలైన బాధిరాలు, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వాళ్లతో నష్టపోయిన వారి విలువ ఎంత అంటూ కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ కేసులో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ.. ఇటీవలే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు.. లీగల్ నోటీసులు పంపారు.
తనపై చేసిన ఆరోపణలపై వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ ఉడుత బెదిరింపులకు భయపడేది లేదన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడుతానని స్పష్టం చేశారు. మంత్రికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు పరువు ఖరీదు రూ.100 కోట్లా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
యువత భవిష్యత్తు మూల్యమెంతో కేటీఆర్ చెప్పాలి?: ఈ క్రమంలోనే యువత భవిష్యత్ మూల్యమెంతో కూడా మంత్రి చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. లీకేజీలో తన కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారన్నారు. వాటిపై తాను ఎన్నికోట్లకు దావా వేయాలని పేర్కొన్నారు. పరువు నష్టం పేరుతో డబ్బులు సంపాదించాలి అనుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాన మంత్రి స్థాయిని, వయసును చూడకుండా విమర్శించడం కేటీఆర్ సంస్కారానికి నిదర్శనం అన్నారు.
సిట్ బెదిరింపులకు భయపడేది లేదు: సిట్ బెదిరింపులకు భయపడేది లేదన్న సంజయ్.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుంచి.. ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీకేజీ వరకు ఐటీ శాఖ మంత్రే బాధ్యత వహించాలని పునరుద్ఘాటించారు. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుంచి.. కుక్కల దాడిలో పసి పిల్లలు మరణాల వరకు మున్సిపల్ శాఖ మంత్రే బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నాపత్రాల లీకేజీలో నష్టపోయిన వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. మంత్రి పదవి నుంచి కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేదాకా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని బండి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: