ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడంలో చేస్తున్న కృషి అనిర్వచనీయమైనదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆరేళ్లుగా పేదల అభివృద్ధి కోసం మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా రూపొందించిన స్వావలంబన భారతదేశం కార్యక్రమ కరపత్రాన్ని ముషీరాబాద్లోని భాజపా క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడానికి కార్యకర్తలు నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని ఆయన వివరించారు.
కరోనాతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే... రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని సంజయ్ మండిపడ్డారు. వైద్యుల సమస్యలు పరిష్కరించడం లేదని... దీంతో కరోనా మహమ్మారి మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.