తమకు ఒక్క అవకాశం ఇస్తే రొహింగ్యాలు, పాకిస్తానీలను తరిమికొడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బేగంపేటలోని చిరాన్ ఫోర్ట్ క్లబ్‌లో వైద్యులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.... అన్ని రకాల వ్యాధులకు వైద్యులు మందులను ఇస్తారని.... సమాజానికి పట్టిన అవినీతి రోగానికి మాత్రం భాజపా మందును ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు హైదరాబాద్ నడి బొడ్డున్న ఉన్నారని వెల్లడించారు. దేశం కోసం కేసీఆర్ కుటుంబం ఎలాంటి త్యాగాలు చేయలేదన్న బండి సంజయ్... త్యాగాలు చేసిన చరిత్ర భాజపాదేనని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ ప్రశాంతంగా లేదని వ్యాఖ్యానించిన ఆయన... హైదరాబాద్లో రొహింగ్యాలు ఉన్నారని... వారికి తెరాస సర్కారే షెల్టర్ ఇస్తోందని విమర్శించారు. ఎంఐఎంను గులాబీ పార్టీ పెంచి పోషిస్తుందన్న సంజయ్... తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ప్రజల్లో విధ్వంస కారులు లేరని... కానీ విధ్వంసం చేయాలనుకునే వారు సమాజంలో ఉన్నారని చెప్పారు. పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలన్న తపనతో పనిచేస్తున్న భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
- ఇదీ చదవండి: అవకాశమిస్తే స్మార్ట్ సూరారం: వెంకటేశ్