BANDI SANJAY LETTER TO KCR: సీఎం కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు ధాన్యం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట నమ్మి వరి వెయ్యని అన్నదాతలకు పరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై ఎఫ్‌సీఐ తనిఖీలు జరిగితే మంత్రులకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే భయమా అని ఎద్దేవా చేశారు. సకాలంలో ఐకేపీ కేంద్రాల ఏర్పాటులో పౌరసరఫరాల శాఖ మంత్రి అలసత్వం వహించారని దుయ్యబట్టారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ముందు హెచ్చరించినా రైతులను, వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేయని వ్యవసాయ శాఖ మంత్రిని మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటు అని బండి సంజయ్ అన్నారు.
ఇదీ చదవండి: 'యాదాద్రిలో ఈ పరిస్థితికి ఇంజినీర్ల వైఫల్యమే కారణం'