Bandi Sanjay fires on KCR : తాను నిఖార్సైన హిందువునని పదే పదే చెప్పుకునే కేసీఆర్.. ధర్మపురి విషయంపై ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో నిన్న పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్‌పై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయమని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా.. ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం సహించరాని విషయమన్నారు.
గోమాతను వధించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అన్నారు. తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులను ఉపసంహరించుకోవాలని.. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేపు తానే స్వయంగా ధర్మపురి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
High Court Hearing On Animal Slaughter On Bakrid : బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో గోవధ, జంతు సంరక్షణ చట్టం కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఇటీవల హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. బక్రీద్‌ను అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తూ నిజమైన స్ఫూర్తితో జరుపుకోవాలని ధర్మాసనం కోరింది.
బక్రీద్ సందర్భంగా మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఇష్టారీతిగా గోవధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.శివకుమార్ నిన్న రాసిన లేఖను సుమోటో పిల్‌గా హైకోర్టు స్వీకరించింది. విచారణ జరిపిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం బక్రీద్ తేదీ ముందే తెలిసినప్పటికీ.. ఒక్క రోజు ముందు లేఖ రాసి చర్యలు తీసుకోమనడం తగదని హైకోర్టు పేర్కొంది.
చివరి నిమిషంలో వచ్చి ఇలాంటి సున్నితమైన అంశాల్లో హైకోర్టును లాగితే ఎలా అని ప్రశ్నించింది. కనీసం నెల రోజులు ముందే వస్తే తాము పర్యవేక్షించడానికి అవకాశం ఉండేదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం గోవధ, పశువుల అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. అందుకు గోవధ, అక్రమ రవాణాపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు ఏజీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. అలాగే ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. అక్రమంగా గోవులను రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఏజీ కోర్టుకు వివరించారు.
ఇవీ చదవండి: