Bandi Sanjay on employees allocation : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికతను కోల్పోయే అవకాశం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల స్థానికతను ప్రమాణికంగా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మూడేళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేసినా గడువు ముగిసేదాకా... ఆ ఊసే ఎత్తకపోవడం దారణమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల స్థానికత, సీనియార్టీ ఆధారంగా జిల్లాలకు సర్దుబాటు చేసే అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించాలన్నారు. మొత్తం ఈ ప్రక్రియనంతా 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని.. లేనిపక్షంలో భాజపా పెద్ద ఎత్తు ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: రేపు దిల్లీకి మంత్రుల బృందం.. ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు