హుజూరాబాద్ ఎన్నికల పుణ్యమా అని.. రెండు రోజుల పాటు కేసీఆర్ కేబినెట్ మీటింగ్.. పెట్టగలిగారు కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. ఏడేళ్ల తర్వాత నిద్ర లేచి ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి సీఎం మాట్లాడుతున్నారని.. 2014లోనే కేంద్రం రాష్ట్రంలోని నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మంజూరు చేసిందన్నారు. వీటికి 50 శాతం సబ్సిడీ కూడా కేంద్రమే భరిస్తుందని ప్రకటించిందని గుర్తుచేశారు.
ఇన్నాళ్లు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని... ఏడేళ్ల తర్వాత నిద్రలేచి కేసీఆర్ ఇపుడు హడావుడి చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఎన్నికల కోసం ప్రకటన లాగా కనిపిస్తోందని ఆరోపించారు. దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి కొద్దిగా పంట దిగుబడి పెరిగితే అదేదో తమ ఘనతగా కేసీఆర్ చెప్పుకుంటున్నారని.. కేంద్ర సంస్థలు ఇచ్చేనిధులతో చేసే ధాన్యం కొనుగోలులో కూడా ఈ ప్రభుత్వం విఫలం అయిందని ఆయన విమర్శించారు. ధాన్యం తడిసి రైతులు బాగా నష్టపోయారన్నారు.
ప్రత్యామ్నాయ సాగుపై ఏది ప్రోత్సాహం..
రుణమాఫీ ఇంకా అందరికి అందలేదని.. ఈ సర్కారు దగ్గర రైతుల కోసం క్రెడిట్ ప్లానే లేదన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. రైతు బంధు డబ్బుల్ని బ్యాంకులు వడ్డీలో కట్ చేసుకున్నారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంట సాగులో రైతులకు ప్రోత్సాహం లేదని.. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసే ప్రకటనలు తప్ప.. అమలు చేసే ఛాన్స్ కనిపించడం లేదని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: Bandi Sanjay: 'హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే కొలువుల నాటకం'