రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు భాజపా నూతన పదాధికారుల తొలి సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి సౌధన్ సింగ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ కృష్ణ దాస్, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన నేతలు... భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు.
గోదావరి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఆ రోజు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నూతన కమిటీ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీనియర్లు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్రెడ్డి