Bjp Starts Strategies for TS Assembly Elections 2023: రాష్ట్రంలో కాస్తా ముందస్తుగానే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. శాసనసభకు ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను ప్రారంభించాయి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రెండు మార్లు అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఊరురా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అధికార పార్టీ నాయకులు ప్రజలను తమవైపు మళ్లించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు: అటు విపక్షాలు సైతం ఇప్పటి నుంచే తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతూ ప్రజలలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మద్ధతు పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో పార్లమెంటరీ ప్రవాస్ యోజన పేరిట పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటూ ఒక వైపు మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అమిత్ షా పర్యటనతో బీజేపీలో ఉత్సాహం: ప్రవాస్ యోజనలో భాగంగానే ఈ నెల 23న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు. చేవెళ్లలో నిర్వహించిన భారీ సభ ద్వారా రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అమిత్ షా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకులకు కార్యాచరణను నిర్దేశించారు. చేవెళ్ల సభకు ముందు శంషాబాద్‌లోని నొవాటెల్ హోటల్‌లో రాష్ట్ర నాయకత్వంతో సమావేశమై.. పార్టీ సంస్థాగత బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. బూత్ కమిటీల ఏర్పాటు సహా పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలు గడువులోగా పూర్తి చేయాలని ఆయన నాయకులకు ఆదేశించారు. త్వరలోనే మళ్లీ కలసి మిగతా అంశాలపై చర్చిద్దామని అన్నారు. దాంతో ఇక నుంచి ప్రతి నెలా ఒక అగ్రనేత రాష్ట్రంలో పర్యటించేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
గోడ రాతలకు పిలుపునిచ్చిన బీజేపీ: తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం టాగ్ లైన్‌తో ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కమలం పువ్వు గుర్తు, ఎన్నికల టాగ్ లైన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా గోడ రాతలు రాయాలని పిలుపునిచ్చింది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం 5 చోట్ల వాల్ రైటింగ్ రాయాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఫార్మాట్లో వాల్ రైటింగ్ చేయాలని సూచించింది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇప్పటికే బీజేపీ నేతలు పలు చోట్ల గోడ రాతలు మొదలు పెట్టారు. ఒక్కసారి అధికారం ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు జనంలోకి వెళ్తున్నారు.
ఇవీ చదవండి: