BJP POSTERS: దిల్లీలోని తెలంగాణ భవన్ పరిసరాల్లో భాజపా పోస్టర్లు, కటౌట్లు వెలిశాయి. తెరాస దీక్ష ప్రాంగణానికి సమీపంలో పోస్టర్లను పెట్టారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 'తెలంగాణ రైతులను గాలికొదిలేసి దిల్లీలో డ్రామాలా', 'చేతనైతే ధాన్యం కొనుగోలు చేయి, లేకపోతే గద్దె దిగు' నినాదాలతో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిని చూసిన తెరాస కార్యకర్తలు తొలగించారు. పోస్టర్లను చింపేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
TRS Protest in Delhi: ఇదిలా ఉండగా... దిల్లీలో తెరాస ధాన్యం దంగల్‌కు సిద్ధమైంది. తెలంగాణలో పండిన ప్రతివడ్ల గింజనూ కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పోరు దీక్షకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధమార్గాల్లో ఉద్యమిస్తున్న గులాబీ పార్టీ.. మరింత ఒత్తిడి పెంచేందుకు హస్తినలో దీక్షకు పూనుకుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస దిల్లీలో తొలిసారి సమరశంఖం పూరించనుంది. తెలంగాణ భవన్‌లో రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో దీక్షను చేపడుతున్నారు.
ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి, మండల పరిషత్, పురపాలక సంఘాల అధ్యక్షులు, అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు భాగస్వామ్యులు కానున్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు.
ఇదీ చదవండి: హస్తినలో "రైతుదీక్ష"కు సర్వం సిద్ధం.. తరలిన గులాబీ నాయకదళం..