BJP MP Laxman On Reservation: రాష్ట్ర రిజర్వేషన్లకు కేంద్ర ప్రమేయంతో సంబంధం లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర రిజర్వేషన్లు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకునే స్వేచ్చ ఆయా రాష్ట్రాలకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 'సేవా పక్షం' పేరుతో కార్యక్రమాలు కొనసాగుతాయని లక్ష్మణ్ తెలిపారు.
ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన నమో ఎగ్జిబిషన్‌ను ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు. ఇప్పుడు గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అంటున్నారు... 8 ఏళ్ళు ఎందుకు వారిని దగా, మోసం చేశారని ప్రభుత్వాన్ని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా జీవో జారీ చేసి గిరిజనులకు రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలుచేయకుండా కేంద్రంపై ఆరోపణలు చేయొద్దని సూచించారు. రాహుల్ గాంధీ భాష్యాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
కుటుంబపార్టీలు అన్నీ ఒక వేదికమీదకు రావాలని చూస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కాంగ్రెసేతర, భాజపేతర నేతలు ఒక్కటవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, తెరాస వేర్వేరు కాదు.. ఇద్దరు కలిసే నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఆ నాటకానికి తెలంగాణ ప్రజలు తెరతీస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నారన్నారని దుయ్యబట్టారు.
సచివాలయానికి రాని సీఎం.. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి అవమానించాలనుకుంటున్నారా అని అసహనం వ్యక్తంచేశారు. లెఫ్ట్‌పార్టీలు, ఇతర పార్టీలు ఏకమైన మునుగోడులో ప్రజలు భాజపా వెంటే ఉంటారని స్పష్టం చేశారు. రజాకారులకు వ్యతిరేకంగా ఒక్క మాటను మాట్లాడకుండా కేసీఆర్ ఉత్సవాలను నిర్వహించారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
"ముఖ్యమంత్రికి ఇంత అవగాహనరాహిత్యం. సామాజిక స్పృహలేనట్టువంటి సీఎం. అంబేడ్కర్ చెప్పినట్టు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లుబాటుకావు. సామాజిక వివక్షకు గురైన వర్గాలకే రిజర్వేషన్లని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత దిగజారే రాజకీయాలు దేనికోసం." - లక్ష్మణ్ రాజసభ సభ్యుడు
ఇవీ చదవండి: న్యూజిలాండ్‌లో 'రాజన్న సిరిపట్టు చీరలు' ఆవిష్కరణ.. కేటీఆర్ హర్షం