BJP MLA Raghunandan Rao reacts on ORR lease issue : ఓఆర్ఆర్ను లీజుకు తీసుకున్న ఐఆర్‌బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అవుటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ధ్వజమెత్తారు. ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ లీజు అవకతవకల విషయంలో సీబీఐకి ఫిర్యాదు చేశామని.. వారే ఇప్పుడు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ అంశంపై కమలం నాయకులు చాలా రోజులుగా ప్రశ్నిస్తున్నారన్నారు. బీజేపీ ఎందుకు మాట్లడటంలేదని కొందరు ప్రశ్నిస్తున్నారని.. తమకెవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 7200 కోట్ల నుంచి 7380 కోట్లకు ఓఆర్‌ఆర్ టెండర్ విలువ పెంచిందెవరని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నేర చరిత్ర కలిగిన ఐఆర్‌బీకి కేటాయించిన టెండర్‌ను రద్దు చేయాలన్నారు. 2018లోనే హెచ్ఎండీఎకు డిఫాల్టర్‌గా మారిందన్న ఆయన.. ఈ విషయాన్ని కొన్ని ఆంగ్ల దినపత్రికలు ప్రచురించాయన్నారు. వేసవి సెలవుల తర్వాత లీజుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ టెండర్ అని చెప్పి.. మరెందుకు నిబంధనలు మార్చారని ప్రశ్నించారు.
"ఓఆర్ఆర్ను లీజుకు తీసుకున్న ఐఆర్‌బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు టోల్‌గేట్ విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించడంలేదు. ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ లీజు అవకతవకల విషయంలో సీబీఐకి ఫిర్యాదు చేశాము. బీజేపీ ఎందుకు మాట్లడటంలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమకెవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదు". - రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
Kishan Reddy on ORR Lease : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ప్రభుత్వం అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్.. కేసీఆర్‌కు భవిష్యత్తులో ఏటీఏంగా మారనుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దీనిపై పూర్తి విచారణ జరిపిస్తామన్న కిషన్‌రెడ్డి.. ఈ కుంభకోణంలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ బేస్ ప్రైస్ ప్రకారం చూసుకున్నా.. 30 ఏళ్లలో ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకు పైగా వస్తుందన్నారు. ఏటా 5 నుంచి 10 శాతం టోల్ రుసుం పెరిగితే రూ.70 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య భారీగా పెరిగి.. టోల్ ఆదాయం ఇంకా ఎక్కువ వస్తుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: