BJP MLA Candidates Final List Telangana 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కమలనాథులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఒక వైపు అభ్యర్ధులు లేక ఇబ్బందులు పడుతన్న బీజేపీకి వరుసగా నేతలు పార్టీని వీడటం కలవరపెడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్లు దక్కని నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికల బరిలో నిలపాలని యోచిస్తుంటే.. స్వంత పార్టీ నేతలు పార్టీని వీడకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ కేవలం 53 మంది అభ్యర్థులనే ప్రకటించింది. తొలి విడతలో 52, ఒక్క పేరుతో రెండో విడతను ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం 53 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో అనేక చోట్ల బీజేపీకి అభ్యర్థులే కరవయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూనే జనసేనతో ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తోంది.
జనసేన 30 సీట్లు కావాలని ప్రతిపాదించగా.. బీజేపీ 10 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు, సీట్ల అంశంపై స్పష్టత రాక ముందే బీజేపీలో పెద్ధ ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జనసేనకు తమ అసెంబ్లీ స్థానం ఇవ్వొద్దంటూ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ జనసేనకు 10 సీట్లు కేటాయిస్తే.. బీజేపీ ఇంకా 56 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది.
Ex MP Vivek Joins Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్
Janasena Alliance With BJP In Telangana : బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 10 అసెంబ్లీ సెగ్మెంట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తాండూరు, కొత్తగూడెం, వైరా, కోదాడ, ఖమ్మం, అశ్వారావుపేట, నాగర్ కర్నూల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లితో పాటు మరో స్థానం కేటాయించనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇంకా స్థానాలకు కేటాయింపు జరగక ముందే బీజేపీ నేతలు కూకట్పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు జనసేనకు కేటాయించవద్దని నిరసనలు చేపట్టారు. శేరిలింగంపల్లి కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆ స్థానాన్ని రవికుమార్ యాదవ్‌కు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ సీటుపై పార్టీ డైలమాలో పడినట్లు సమాచారం.