NVSS Prabhakar criticise KCR: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన విజయవంతం అయ్యిందని.. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. మోదీ తెలంగాణలో 11 వేల కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం.. కేసీఆర్‌కి కంటగింపుగా ఉందని అందుకే గైర్హాజరయ్యారని విమర్శించారు.
రాజకీయాలు వేరు అభివృద్ధి వేరని.. రాజకీయ దుర్భుద్ధి కారణంగానే కేసీఆర్ మోదీకి స్వాగతం పలకలేదని, కనీసం అభివృద్ధి పనుల్లోనూ పాల్గొనలేదని మండిపడ్డారు. మోదీ రాష్ట్రానికి వస్తే తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి కేసీఆర్ అని.. దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా లేరని దుయ్యబట్టారు.
మోదీ సభ అనంతరం బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేశారు.. కానీ కల్వకుంట్ల కుటుంబం ఎక్కడా మోదీని విమర్శించే ధైర్యం చేయలేదని, అలా చేస్తే కుటుంబ పాలన అనేది స్పష్టంగా కనిపిస్తుందని.. ట్విటర్‌కే పరిమితమయ్యారన్నారు. మోదీని ఎదుర్కొనే సాహసం కల్వకుంట్ల కుటుంబం చేయలేదన్నారు. కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు తప్పితే.. మనస్ఫూర్తిగా ఎవరూ విమర్శించలేదని తెలిపారు.
అభివృద్ధిని ప్రోత్సహించకుండా.. అడ్డుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. అజంజాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేరకుండా అడ్డుకుంటున్నది కేసీఆరే అని.. లీకు వీరుడు, లిక్కర్ రాణిని ఎలా కాపాడుకోవాలని మాత్రమే బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
కొత్త పరిశ్రమలను కూడా మూసేయించి ఆ భూములపై కేసీఆర్ కూతురు, కుమారుడు కన్నేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను ముగ్దుమ్ భవన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు ఏనాడైనా దిల్లీ లిక్కర్ కేసు, పేపర్ లీక్ కేసుపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని.. పక్క రాష్ట్రాలకు కేటాయించినన్ని నిధులు తెలంగాణకు కేటాయించడం లేదని అర్ధరహిత విమర్శలు చేస్తున్నారన్నారు.
"రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు.. రాజకీయ దుర్భుద్ధి కారణంగానే కేసీఆర్.. ప్రధాని ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. మమతా బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ మోదీని విమర్శించినా.. తమ రాష్ట్రాలలో ప్రధాని ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి. రాష్ట్ర విభజన హామీలు నెరవేరకుండా, అభివృద్ధి పనులు జరగకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారు". -ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
ఇవీ చదవండి: