కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కశాతం కూడా అక్షరాస్యత పెరగలేదన్నారు. భాజపా అనుబంధంగా మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి నేతృత్వంలో '12వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేదలకు కేజీ టు పీజీ, తన మనువడితోపాటు తన డ్రైవర్ కుమారుడు కూడా ఒకే పాఠశాలలో చదువుతారన్న కేసీఆర్ మాటలు విని ప్రజలు మోసపోయారని లక్ష్మణ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని గాలికొదిలేసిందని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి కేసీఆర్ కుటుంబ సభ్యులే పేర్లు మార్చి గుత్తాధిపత్యం చెలాయిస్తూ పేదలకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావుతోపాటు పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, సరోత్తమరెడ్డి, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం: లక్ష్మణ్