TRS MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. డిసెంబర్ 5 వరకు సిట్ నోటీసులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26 లేదా 28న విచారణకు హాజరుకావాలని సంతోష్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇవాళ బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సంతోష్ లంచ్ మోషన్‌పై విచారణ జరపిన న్యాయస్థానం.. సిట్ నోటీసులపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అంతకుముందు సిట్ నోటీసులను రద్దు చేయాలంటూ భాజపా సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి నేత బీఎల్ సంతోష్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈనెల 21న హాజరు కావాలని... బీఎల్ సంతోశ్‌కు సిట్ మొదట నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసు రద్దు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. బీఎల్ సంతోశ్‌ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంతోష్ విచారణకు హాజరు కావడం లేదని సిట్ హైకోర్టుకు తెలపడంతో... మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నెల 26 లేదా 28న హాజరు కావాలని... ఈనెల 23న రెండోసారి నోటీసును పంపించారు. సిట్ తాజా నోటీసును సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా లేకపోయినప్పటికీ.. కనీసం ఫిర్యాదులో పేరు లేకపోయినప్పటికీ.. సిట్ అధికారులు దురుద్దేశపూర్వకంగా తనకు నోటీసులు పంపిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సిట్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తోందన్నారు. కాబట్టి నోటీసులు రద్దు చేయాలని.. విచారణకు హాజరుకాకుండా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి: