ప్రజా సమస్యలపై తన గొంతును వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు కోరారు. నిరుద్యోగుల సమస్యలపై తన గళాన్ని మరింత వినిపించేందుకు భాజపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట్ కార్తీక గార్డెన్లో భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలని రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ రెండేళ్లుగా యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా పాలనను గాలికొదిలేసిందన్నారు. తెరాస మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకుండా పట్టభద్రులను మోసం చేస్తోందని మండిపడ్డారు. మేధావులందరూ ఆలోచించి భాజపాకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.