BJP focus On Operation Akarsh In Telangana : కర్ణాటక ఎన్నికల ఫలితాలు, పార్టీ సంస్థాగత మార్పులతో రాష్ట్ర బీజేపీలో కలవరం మొదలైంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. శ్రేణుల్లో జోష్ తగ్గిపోవడంతో పాటు నేతలు పార్టీని వీడుతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ పరిస్థితుల్లో జాతీయ నాయకత్వం సంస్థాగత మార్పుల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడైన బండిసంజయ్‌ను మార్చి కిషన్ రెడ్డిని నియమించడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి.
బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని.. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారనేది పక్కన పెడితే కాషాయ శ్రేణులు మాత్రం నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి తీసుకువచ్చేందుకు బండి సంజయ్ అహర్నిశలు పోరాటం చేస్తుంటే ఆకస్మాత్తుగా ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చడంపై రాష్ట్ర బీజేపీ శ్రేణులు జాతీయ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Telangana BJP Special Focus On Operation Akarsh : ఇక బీజేపీ పనైపోయిందని నేతలు పక్కపార్టీలోకి వెళ్లేందుకు మార్గాలు అన్వేషించుకునే పనిలో పడ్డారు. దీంతో రాష్ట్రపార్టీలో జోష్ తగ్గి శ్రేణులు డీలాపడిపోయాయి. వరంగల్ ప్రధాని సభతో పాటు కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో బండి సంజయ్ పనితీరుపై నేతల మాటలు, శ్రేణుల్లోని ఉత్తేజం చూసి జాతీయ నాయకత్వం నివ్వెరపోయింది. అధ్యక్షుడిని మార్చి తప్పుచేశామనే భావన కలిగింది. అప్రమత్తమైన జాతీయ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జాతీయ జట్టులో బండికి చోటు కల్పించింది. జాతీయ ప్రధానకార్యదర్శిగా ఆయన్ను నియమించింది. ఈ నియామకం రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బండి సంజయ్ నియామకం దోహదం చేస్తోందని రాష్ట్ర నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
బలహీనంగా ఉన్న చోట పార్టీ బలోపేతం : రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉన్న చోట చేరికలను ప్రోత్సహించాలని అగ్రనాయకత్వం ఆదేశించింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదునుపెట్టి ఇతర పార్టీల్లోని బలమైన అసంతృప్తి నేతలను పార్టీలో చేర్చుకోవాలని సూచించింది. అవసరమైతే జాతీయ నాయకత్వం సైతం రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతుందని స్పష్టం చేసింది. జాతీయ నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం చేరికలపైన దృష్టి కేంద్రీకరించింది.
BJP Silent Operation In Telangana : మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ఫోకస్ పెట్టింది. ఆయన హాయాంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ ఛైర్మన్లుగా పనిచేసిన నేతలను లక్ష్యంగా పెట్టుకుంది. కిరణ్‌కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణలో తనతో సత్సంబంధాలు ఉన్న నేతలను కాషాయ గూటికి చేర్చే పనిలో పడినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ నెల 29న దిల్లీలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి కాషాయకండువా కప్పుకున్నారు. వీరి చేరికకు ఒక్క రోజు ముందు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ తరువాతి రోజే హస్తినలో చేరికల తంతు జరిగింది. మరికొంత మంది కాంగ్రెస్‌లోని మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.
బీజేపీలో చేరికలు : మరోవైపు ఇవాళ కిషన్ రెడ్డి సమక్షంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కాషాయ కండువా కప్పుకోనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కిషన్‌రెడ్డితో జయసుధ భేటీ అయినట్లు సమాచారం. సికింద్రాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి జయసుధను ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్నారు. జయసుధ మాత్రం సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీజేపీ బలం పెరుగుతుందని శ్రేణులు భావిస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ మరింత దూకుడు పెంచుతారనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది.
ఇవీ చదవండి :