Telangana Assembly Elections 2023 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేసిందని.. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలోనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న వేల కోట్ల నగదును బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని.. ప్రజాధనాన్ని మొత్తం దుర్వనియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు నాణెనికి ఉన్న బొమ్మ, బొరుసులాంటివి అని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఎన్నికల ముందు లేదా తరవాత అయిన ఒకటి అవుతాయని వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఆ రెండు పార్టీలో ఎవరికి ఓటు వేసినా.. బీఆర్ఎస్కే పడినట్లు అవుతుందని ఆరోపించారు.
Kishan Reddy Latest Comments on BRS : రాజకీయం తప్పితే ముఖ్యమంత్రి కేసీఆర్కు అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తానంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఓల్డ్ సిటీకి మెట్రో అంటున్నారని.. ఇన్నేళ్లు గుర్తుకురాని అంశం ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందని నిలదీశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ రెండు కలసి ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారితో దోస్తే చేసే పార్టీ ఎంఐఎం అని వ్యాఖ్యానించారు.
BJP Telangana Election Plan 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. బీజేపీ 100 రోజుల ప్రణాళిక
Kishan Reddy Comments on KCR : జిల్లా, అసెంబ్లీ స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు. రాజకీయ నాయకులు బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారని తెలిపారు. గ్రామస్థాయి నుంచి చేరికలు జరగాలి సూచనలు ఇచ్చారు. కష్టపడి పనిచేస్తేనే ప్రజలు విశ్వసిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ అభివృద్ధితో పాటు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకి వివరించాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతుల సమస్యలు, ధరణి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిరుద్యోగులకు చేసిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేస్తున్నాయని మండిపడ్డారు.
Kissan Reddy Fire on Congress : డబుల్ బెడ్ రూం అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. అర్హులను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఏపీలో లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించారని.. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మందుకు రాలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి 11 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తొమ్మిది ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి పావలా వడ్డి రుణాలు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని.. ధరణి ఫోర్టల్ వల్ల రైతులకి కలిగిన లాభం ఏమిటని ప్రశ్నించారు. వారికి ఉన్న భూమి కూడా వారి పేరు మీద లేదని పేర్కొన్నారు. అలానే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజ్ వల్ల నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. ఈ విషయంపై బండి సంజయ్ పోరాడినా.. ప్రభుత్వం స్పందించ లేదని అన్నారు.
రాష్ట్రం ఒక్క కుటుంబానికే బందీ అయింది : రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ బీజేపీయే అని గుర్తు చేశారు. ఉద్యమంగా పోరాడి తెలంగాణ తీసుకువస్తే.. కేవలం ఒక్క కుటుంంబం చేతిలో బందీ అయిందని విమర్శించారు. ఉద్యమాలు నిర్వహించి.. ప్రజలకి భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే మూడు నెలలు సమగ్రంగా ప్రణాళిక చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే, అరుణ, జితేందర్ రెడ్డి, అరవింద్, సోయం బాపూరావు, గరికపాటి మోహన్ రావు, రాంచందర్ రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :