సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. శాసనసభ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు.. విడతల వారీగా ముట్టడికి వచ్చిన నేతలు, కార్యకర్తలను నిలువరించేందుకు శ్రమించారు. ముందస్తు అరెస్టులతో పాటు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను బంజారాహిల్స్ శ్రీనికేతన్‌కాలనీలోని ఆయన నివాసంలో గృహ నిర్భంధం చేశారు. సంజయ్ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా...అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు-భాజపా కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాహనానికి కార్యకర్తలు అడ్డుపడగా.. వాళ్లను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డ బండి సంజయ్.. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలనేది ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
ఎక్కడికక్కడే అరెస్టులు
తార్నాకలో భాజపా నగర అధ్యక్షుడు, ఎమ్ఎల్సీ రాంచందర్‌రావు నివాసం వద్ద పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలి సమావేశాలు ఉండటం వల్ల.. రాంచందర్‌రావును పంపించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత్‌రెడ్డి అసెంబ్లీ ముట్టడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బంగారు శృతి సహా మిగతా నేతలను గోషామహల్ మైదానానికి తరలించారు. భాజపా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి అసెంబ్లీకి ముట్టడికి బయల్దేరగా.. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.
అరెస్టులను నిరసిస్తూ..
రాష్ట్రవ్యాప్తంగానూ భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్ బయల్దేరకుండా నిలువరించారు. భూపాలపల్లి, చిట్యాల, రేగొండలో కమలం నేతలను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, సిద్దిపేట జిల్లా దుబ్బాక, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో భాజపా నేతలు ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి, వనపర్తిలో ముందస్తు అరెస్టులను నిరసిస్తూ భాజపా నేతలు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో శ్రేణులను పోలీసులు నిలువరించారు. ఆదిలాబాద్ జిల్లా నేతల్ని గృహ నిర్బంధం చేశారు.
ఇదీ చూడండి : నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం