జీహెచ్‌ఎంసీ మొదటి సాధారణ సమావేశాన్ని వర్చువల్ వేదికగా కాకుండా భౌతిక పద్ధతిలో నిర్వహించాలని భాజపా కార్పొరేటర్లు కమిషనర్ లోకేష్‌కుమార్‌కు లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మొదటి సాధారణ సమావేశం ఈ నెల 29న నిర్వహించేలా మేయర్ నిర్ణయించారని లేఖలో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ 2021-22 అంచనా బడ్జెట్‌ను వర్చువల్ పద్ధతిలో సమర్థవంతంగా చర్చించలేమని కార్పొరేటర్లు.. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్డౌన్ను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసిందని కార్పొరేటర్లు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన రాజకీయ కార్యకలాపాలు, బహిరంగ సమావేశాలను ప్రారంభించారని చెప్పారు. పల్లె బాట కార్యక్రమం కింద గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను పెద్ద ఎత్తున కలుసుకున్నారని లేఖలో వెల్లడించారు. కార్పొరేటర్లు, ఎక్స్- అఫిషీయో సభ్యులు, ఇతర సిబ్బంది కలిపి 250 మందికి మించకుండా ఉన్నారని వివరించారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ జీహెచ్‌ఎంసీ మొదటి కౌన్సిల్ సమావేశాన్ని భౌతిక పద్ధతిలో నిర్వహించవచ్చని సూచించారు. ముఖ్యమైన ఎజెండాను భౌతిక సమావేశంలో సుదీర్ఘంగా చర్చించవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: KCR Review: జులై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు