గ్రేటర్ హైదరాబాద్కు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తన కార్యకర్తలతో అసెంబ్లీని ముట్టడించారు. జీహెచ్ఎంసీకి ప్రత్యేక నిధులు కేటాయించి నగర శివారున ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు సహకరించాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి తన కార్యకర్తలతో ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మిగులు బడ్జెట్ ఉన్న దానిని రూ.6 వేల కోట్లకు పైగా అప్పుల కుప్పగా చేసి రోజుకు రూ.కోటి ముప్పై లక్షల మిత్తి కడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ విశ్వనగరం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కేవలం రూ.31 కోట్లు బడ్జెట్లో కేటాయించారని తెలిపారు. కేటాయించిన మొత్తం కేవలం అధికారుల జీతాలకే సరిపోతుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఆదాయానికి జీహెచ్ఎంసీ గుండెకాయలాంటిదని గుర్తు చేశారు.
గత రాత్రి నుంచే పోలీస్ శాఖ వారు ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారని వాటన్నింటినీ తప్పించుకొని ఎన్ని ఆంక్షలు విధించినా అసెంబ్లీ గేటును తాకి ముట్టడించామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడమని.. ఎన్ని అరెస్టులు చేసినా భయపడబోమని చెప్పారు. ప్రజల హక్కుల కోసం.. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా అభివృద్ధి కోసం నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ ధర్నా అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: