తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. బయట తెరాసను ఎదుర్కొనేందుకు చాలా మంది నేతలున్నా శాసనసభలో ఒకే సభ్యుడు ఉన్నాడు. సభలో తమ బలాన్ని పెంచుకోవాలనుకుంటున్న కాషాయ దళం కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నా... అనర్హత వేటు పడుతుందన్న ఆలోచనతో ఇంకా వెళ్లలేదు.
విలీనం
తెరాసలో చేరినవారిని మినహాయిస్తే ప్రస్తుతం హస్తం పార్టీలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురిని భాజపాలో చేర్చుకుంటే అనర్హత వేటు ఉండదని.. పార్టీ విలీనం అయినట్లు అవుతుందని భావిస్తోంది. ఆ దిశగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గతంలో భాజపాలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేతో తెలంగాణకు చెందిన జాతీయస్థాయి నేత మాట్లాడినట్లు తెలుస్తోంది.రాష్ట్ర స్థాయిలోనూ ఒకరిద్దరు నేతలు హస్తం పార్టీ శాసనసభ్యులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇదీ చూడండి :హెల్మెట్ పెట్టుకుంటేనే జైల్లోకి.