BJP Corner Meetings in Telangana: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాషాయదళం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని బీజేపీ జాతీయ నాయకత్వం విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన అగ్రనేతలు రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తున్నారు.
ప్రత్యేకంగా పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస - బీజేపీ భరోసాతో పాటు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు నాయకులు హాజరవుతున్నారు. ఇలా ఒక వైపు పార్లమెంట్ ప్రవాస్ యోజన.. మరోవైపు ప్రజా గోస - బీజేపీ భరోసాపై రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. ఈ కార్యక్రమాల్లో నేతలు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా 11వేల వీధి సభలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 10న ప్రారంభమైన ఈ సభలు 25వ తేదీ వరకు ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లలో కొనసాగనున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఇవి దోహాదపడతాయని నేతలు భావిస్తున్నారు. పార్టీ బలంగా లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి ఎన్నికల నాటికి బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సభలను నిర్వహిస్తున్నారు.
వీధి సభల నిర్వహణను జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సభలను విజయవంతంగా నిర్వహించే బాధ్యతలను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ సునీల్ బన్సల్‌కు అప్పగించింది. ఉత్తరప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల నాడి పట్టుకుని పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంలో వీధి సభల పాత్ర కీలకమైంది. ఇందుకోసమే అక్కడ వీధి సభల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన బన్సల్కే తెలంగాణ బాధ్యతలు కూడా అప్పగించింది. బన్సల్ సభలు జరుగుతున్న తీరుపై కో-ఆర్డినేటర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు.
అయితే బిజీబిజీగా సాగుతున్న ఈ కార్యక్రమాలతో కొంతమంది నేతలు ఇబ్బందిగా భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తామేమీ చేయలేమని అధిష్ఠానం ఆదేశాలు తూ.చ తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్లు ప్రచారం నడుస్తోంది.
ఇవీ చదవండి: