BJP Bus Yatra In Telangana 2023 : రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలనాథులు కార్యాచరణ చేపడుతున్నారు. వచ్చే నెల ప్రథమార్థంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలను చేపట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ నెల 26 నుంచి రథయాత్రలు ప్రారంభించేందుకు సమయాత్తమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే రథాలను సైతం సిద్ధం చేసింది.
BJP Rath Yatra In Telangana 2023 : రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన బీజేపీ నేతలు.. బాసర, సోమశిల, భద్రాచలం నుంచి యాత్రలను ప్రారంభించాలని నిర్ణయించారు. బాసర జోన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలను కలిపి ఒక రూట్‌గా ఏర్పాటు చేశారు. అలాగే, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సోమశిల జోన్ పరిధిలో.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలను భద్రాచలం జోన్‌గా విభజించారు. 33జిల్లాల్లో 19 రోజులు 4 వేల కిలోమీటర్లు చుట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : బాసర జోన్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సోమశిల నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, భద్రాచలం నుంచి పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అన్ని రథయాత్రలు ఒకేరోజు ప్రారంభించడం కుదరని పక్షంలో 26న ఒక రూట్‌లో, 27న మరో రూట్, 28న ఇంకొక రూట్ నుంచి యాత్ర ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ యాత్రలు అక్టోబర్ 14న ఓకే చోట ముగించేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది. యాత్రలు ముగిసే నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లో ముగింపు సభను నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించేలా బీజేపీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రథయాత్రలతో ఎన్నికల రణభేరి మోగించేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. యాత్రలో భాగంగా రోజు 2 నియోజకవర్గాలను చుట్టేలా బీజేపీ నేతలు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. అలాగే, అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్ర మంత్రులని రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులు ప్రజలకు వివరిస్తూనే.. తొమ్మిదేళ్ల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. శాసన ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెబుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
Kishan Reddy Fires On CM KCR : 'ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారు'
Congress Party joinings in Telangana : కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు